కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నిర్బలగా సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరీ క్షమాపణలు కోరారు. నిర్మల తనకు సోదరివంటిదని పేర్కొన్నారు. తన మాటల వల్ల నిర్మల బాధపడినట్లయితే క్షమించాలంటూ లోక్‌సభలో కోరారు.
"చర్చల సమయంలో నేను సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నిర్బలగా పేర్కొన్నాను. నిర్మల నాకు సోదరి వంటిది. నేను నిర్మలకు సోదరుడి వంటి వాడిని. ఈ సోదరుడి వ్యాఖ్యల వల్ల నా సోదరి ఏమైనా బాధపడితే నేను క్షమాపణలు కోరుతున్నాను."
-అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత.
నిర్బల వ్యాఖ్యలు
సోమవారం పన్నుల చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అధీర్ మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటూ ఆక్షేపించారు. "మీ పట్ల మాకెంతో గౌరవం ఉంది. కానీ కొన్నిసార్లు మిమ్మలని నిర్మలా సీతారామన్‌కు బదులుగా నిర్బల (బలహీన) సీతారామన్ అని పిలవడం సముచితమో, కాదో అనే ఆశ్చర్యం వ్యక్తమవుతుంటుంది. మీరు మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు మీరే అధిపతి. కానీ, ఆర్థిక వ్యవస్థపై మీరు మనసు పెట్టి మాట్లాడుతున్నారో లేదో మాకు తెలియడంలేదు" అంటూ అధీర్ వ్యాఖ్యానించారు. అయితే అధీర్ వ్యాఖ్యలను నిర్మల దీటుగా తిప్పికొట్టారు. తమ పార్టీలో ప్రతీ మహిళా సబలే(ధృఢమైనవారే) అంటూ పేర్కొన్నారు.