గత వేసవిలో తమిళనాడు, మహారాష్ట్రల్లో మంచినీటి కోసం ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పనలవి కావు. నీటి సంరక్షణ తక్షణ కార్యక్రమంగా ప్రభుత్వాలు చేపట్టకపోతే 2022 నాటికి నీటికోసం జరిగే యుద్ధాల్లో మనదేశమూ భాగమవుతుందన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆందోళనను తోసిపుచ్చలేం. ‘నీటి దుర్వినియోగంలో ప్రభుత్వానికి, ప్రజలకు సమాన బాధ్యత ఉంది. మనవాళ్లు హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యతల గురించి పట్టించుకో’రన్న మంత్రి మాటల్లో నిజం లేకపోలేదు. మున్ముందు చెన్నై, బెంగళూరు నగరాలు మరో కేప్‌టౌన్‌లా మారతాయన్న షెకావత్ ఆవేదనను కొట్టిపారేయలేం!
భూతాపం, వాతావరణ మార్పుల తొలి దుష్ఫలితాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన మొట్టమొదటి నగరం కేప్‌టౌన్. 2017-18లో ఈ నగరం ఎదుర్కొన్న నీటి సంక్షోభం- ప్రపంచానికే పెద్ద హెచ్చరిక! 40 లక్షల మంది ప్రజలు నీటి కోసం నానా ఇబ్బందులు పడ్డారు. కష్టకాలంలో పౌరులు రోజుకు 50 లీటర్ల నీరు మాత్రమే వాడారు. ఇది అమెరికాలో ఒకవ్యక్తి ఉదయం స్నానానికి వాడే నీటితో సమానం. మాసిన దుస్తులు ఉతుక్కునే పరిస్థితీ లేని రోజులవి. వేసుకున్న చొక్కాను తక్కువసార్లు ఉతికినవారికి బహుమతులు ఇచ్చే పోటీలూ నిర్వహించారు. దుకాణాలు, హోటళ్లు, మూత్రశాలల్లో నీటిని వాడవద్దన్న ప్రకటనలు ప్రదర్శించారు. నగర పాలక సంస్థ ‘జీరో డే’ పేరిట నెలల తరబడి కుళాయిలను ఆపేసింది. ఇంటింటికి మనుషులను లెక్కవేసి తాగడానికి, వాడుకకు కలిపి 50 లీటర్లు సరఫరా చేశారు. ఇందుకోసం నగరంలో 200 సేకరణ కేంద్రాలు ప్రారంభించారు. నీటి దుర్వినియోగాన్ని నివారించేందుకు ‘వాటర్ పోలీసు’లు ఆకస్మిక తనిఖీలూ జరిపారు. కేసులు పెట్టి భారీ జరిమానాలు వడ్డించారు.
పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల ప్రభావాన్ని ఎల్‌నినో అంటారు. నిరుడు దీని వల్ల వాతావరణం వేడెక్కి మేఘాలు కనుమరుగయ్యాయి. దాంతో పచ్చదనానికి చిరునామా అయిన దక్షిణాఫ్రికాలో తీవ్రమైన కరవు ఏర్పడింది. ప్రాజెక్టుల్లోని నీరు ఇంకిపోయింది. ఒకప్పుడు నీటి నిర్వహణలో ప్రపంచానికి పాఠాలు నేర్పిన కేప్‌టౌన్ నీటి కోసం కటకటలాడింది. పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను తీర్చడంలో అక్కడి పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే దుష్ఫలితాలకు కేప్‌టౌన్ అనుభవమే నిదర్శనం.
దక్షిణ అట్లాంటిక్ సముద్రతీరాన ఉండే కేప్‌టౌన్ దక్షిణాఫ్రికాలోని విలాసవంతమైన నగరం. ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. నల్లజాతి ‘సూరీడు’ నెల్సన్ మండేలా సుదీర్ఘకాలం జైలులో ఉన్నదీ ఈ నగరంలోనే. ఏటా సుమారు 20 లక్షల మంది పర్యాటకులు కేప్‌టౌన్ వస్తారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు. ఏటా 330 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. అయిదు నక్షత్రాల హోటళ్లు, అందమైన సాగరతీరాలు, అద్భుతమైన నౌకాశ్రయాలు, కేబుల్ కార్స్, వ్యాపార సముదాయాలు, ద్వీప విహార కేంద్రాలు, సైకిల్ రేసులు, క్రికెట్, రగ్బీ... ఇలా పర్యాటకుల మనసు దోచే నగరం కేప్‌టౌన్. ఇన్నున్నా దాహమేస్తే గుక్కెడు నీళ్లు లేనప్పుడు అంతకన్నా పేదరికం ఏముంటుంది? నీటి కరవు వచ్చిన నాటి నుంచి కేప్‌టౌన్ పర్యాటకం పడకేసింది. ఆర్థిక పరిస్థితీ కుంగిపోయింది. అభివృద్ధి అంతా ఒక్క నీటిచుక్క ముందు ఓడిపోయింది.
ఎక్కడో కేప్‌టౌన్‌లో కరవొస్తే మనకేంటి అనుకుంటే పొరపాటు పడినట్లే! ప్రపంచ దేశాలకు ఇది ప్రమాద ఘంటిక. ప్రపంచంలో నీటి ప్రమాదం అంచున ఉన్న నగరాల్లో బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపాలో మొదటిస్థానంలో ఉంది. బెంగళూరు నగరానిదే రెండోస్థానం. బీజింగ్, కైరో, మాస్కో వంటి నగరాలూ ప్రమాదం అంచునే ఉన్నాయి. చెన్నై నగరంలో నీటి కటకట పరిస్థితులు చూశాం. ఇప్పటికీ అక్కడ చాలా చోట్ల నీటి ట్యాంకులే ఆధారం. స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశంలో తలసరి నీటి లభ్యత 5,000 క్యూబిక్ మీటర్లు. ఇప్పుడు 1,540 క్యూబిక్ మీటర్లే. అంటే మూడొంతుల నీటి వనరులు వట్టిపోయాయి. అభివృద్ధి పేరిట అడవులు నరికేస్తున్నాం. నీటిని ఒడిసి పట్టే చెరువులు పూడ్చేస్తున్నాం. రుతుపవనాల రాకలో స్పష్టత ఉండటం లేదు. వర్షం పడినా నీళ్లు ఇంకే పరిస్థితులు లేవు. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళానికి తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఆశాకిరణాలుగా మారాయి. చెప్పాలి.
భూమిపై 70 శాతం నీరు ఉన్నా తాగడానికి పనికొచ్చేది అందులో మూడు శాతమే. ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు. అందులో కోటి మంది చుక్కనీరైనా అందుబాటులో లేకుండా జీవనం సాగిస్తున్నారు. 270 కోట్ల మంది చాలీచాలని నీటితో బతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాలు నీటి సంక్షోభానికి దగ్గరలో ఉన్నాయి. వీటిలో కొన్ని నగరాలు భారత్‌లోనూ ఉన్నాయి. దేశంలో ఏటా వర్షపాతం తగ్గిపోతోంది. పంట దిగుబడులు పడిపోతున్నాయి. జీవనదులు మురికికూపాల్లా మారిపోతున్నాయి. ఒక నదిని నాశనం చేస్తే పరీవాహక ప్రాంతాన్నంతా నాశనం చేసినట్టే. మారిన పరిస్థితుల్లో నీటి వనరుల అభివృద్ధి, సంరక్షణ అత్యంత కీలకం. ఈ బాధ్యత ప్రభుత్వాలదో, ఇతర సంస్థలదో మాత్రమే కాదు. అందరిదీ అని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ చేయీ చేయీ కలిపి ముందుకు సాగాలి. అప్పుడే మున్ముందు ఎదురయ్యే ముప్పును అధిగమించగలం!
- కొత్తూరి సతీష్ కుమార్
ఇదీ చూడండి ; దిల్లీ కాలుష్యం: ఆయువు తోడేస్తున్న వాయువు