కశ్మీర్లో పర్యటిస్తున్న ఐరోపా సమాఖ్య ఎంపీల బృందానికి.. ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం స్వాగతం పలికాయి. ఈ నేపథ్యంలో ఎంపీలకు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
ఈయూ ప్రతినిధులను ఎయిర్‌పోర్టు నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య హోటల్‌కు తరలించారు. వారికి కశ్మీరీ సంప్రదాయాలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఐరోపా సమాఖ్య ప్రతినిధుల బృందం ప్రఖ్యాత దాల్ సరస్సును సందర్శించారు. వారందరు కలిసి పడవల్లో విహరిస్తూ సరస్సు అందాలను వీక్షించారు. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను ఎంపీలకు వివరించారు అధికారులు.
మంగళవారం కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు గాయపడ్డారు. శ్రీనగర్‌లో ప్రజా జీవనం స్తంభించింది. నగరంలోని పలు రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు తెరుచుకోలేదు.
ఈ నేపథ్యంలో వారం రోజులుగా తెరుచి ఉన్న దుకాణాలు కూడా నేడు తిరిగి మూతపడ్డాయి. అయితే కశ్మీర్లో పదో తరగతి పరీక్షలు మాత్రం ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.