భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజేంద్రకుమార్ తివారీ, డీజీపీ ఓంప్రకాశ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో తన ఛాంబర్లో భేటీ అయ్యారు.
నవంబర్ 17 లోపు అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయకంగా అత్యంత సున్నితమైన రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసు తీర్పు వెలువడనున్న దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను ప్రధాన న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇంకా ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారని తెలుస్తోంది.
అయోధ్య భూ వివాదంపై మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు విఫలం కావటంతో... సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 40 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. గతనెల 16న తీర్పును వాయిదా వేసింది.
ఈ నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.