వివాదాస్పద 2019-పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇదివరకే ఈ బిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ఊపగా.. తాజాగా సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదం తెలిపింది.
భారత్‌లోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల ముస్లిమేతరులకు దేశ పౌరసత్వం కల్పించే ఈ బిల్లుకు పెద్దలసభలో 125 మంది మద్దతు తెలపగా.. 105 మంది వ్యతిరేకించారు. శివసేన తటస్థంగా ఉండిపోయింది. మొత్తం 245 మంది సంఖ్యా బలమున్న పెద్దల సభలో ప్రస్తుతం అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉండగా ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా 125 ఓట్లు వచ్చాయి.
అంతకు ముందు... ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలా? వద్దా? అనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ అనంతరం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేందుకు నిరాకరించారు. నిరాకరణకు అనుకూలంగా 113 ఓట్లు.. వ్యతిరేకంగా 93 ఓట్లు వచ్చాయి.
'ముస్లింలకు ఏ ఢోకా ఉండదు'
విపక్షాల ప్రశ్నలకు రాజ్యసభలో సుదీర్ఘంగా సమాధానమిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బిల్లుతో భారతీయ ముస్లింల భవిష్యత్‌కు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే బిల్లు తెచ్చామని.. దీనిపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విపక్షాలకు సూచించారు. ఎన్నికలకు ముందే బిల్లుపై హామీ ఇచ్చామని.. భారత్‌లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించారు.
"50 ఏళ్ల క్రితమే ఈ బిల్లు తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితులు ఉండేవి కాదు. దేశ విభజన జరగకపోయి ఉన్నా లేదా ఆ విభజన మతం ఆధారంగా జరగకుండా ఉంటే ఇవాళ ఈ బిల్లు తేవాల్సిన అవసరం ఉండేదే కాదు. అల్పసంఖ్యాకుల విషయంలో నాడు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత్ అనుసరిస్తోంది. కానీ ఆ మూడు దేశాలు ఒప్పందాన్ని నిలబెట్టుకోనేలేదు. అందువల్లే ఆ మూడు దేశాల్లో ఉంటున్న అల్ప సంఖ్యాకులు తమ ధర్మాన్ని, పరివారాన్ని,వారి కుటుంబంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వారు భారత్‌కు వస్తున్నారు. అయితే ఈ బిల్లులో ముస్లింలను ఎందుకు చేర్చలేదని అంటున్నారు. అయితే ఈ బిల్లులో ఆరు మతాలకు చెందిన అల్ప సంఖ్యాకులను చేర్చినందుకు అభినందించకుండా ముస్లింలను ఎందుకు చేర్చలేదంటూ అడగడంపై నేను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాను. విపక్షంలో ఉన్నవారు ఎవరైనా నాకు ఒక విషయం చెప్పండి. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్‌లో ఇస్లాం పాటించేవారు ఎవరైనా మైనారిటీలు అవుతారా.? ఆ దేశాలు ఇస్లామిక్ దేశాలు అయినప్పుడు ఆయా దేశాల్లో ఇస్లాం అనుసరించే వారిపై దాడులు చాలాచాలా స్వల్పంగానే ఉంటాయి. అయినప్పటికీ ఆ దేశాల నుంచి ఎవరైనా భారత రాజ్యాంగం మేరకు శరణు కోరితే వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం."
-అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి
విపక్షాల విమర్శలు
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న అనేక దేశాలు ఉండగా.. కేవలం ఆ మూడు దేశాల్లోని మైనారిటీల సమస్యలపైనే కేంద్రం దృష్టి సారించడం వెనుక కారణాలు ఏమిటని కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీసింది.రాజ్యాంగ సమ్మతం కాకుండా చేస్తున్న ఈ చట్టం న్యాయసమీక్షలో నిలవదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. చర్చలో పాల్గొన్న కొన్ని పార్టీలు.. ఈ బిల్లును సమర్థించగా మరికొన్ని వ్యతిరేకించాయి.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పు రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం అంతర్గత విచారణ