గ్రహణాలు గ్రహాల గమనంలో భాగంగా ఏర్పడుతాయని ఎన్ని సార్లు రుజువు చేసినా.. అదేదో మహత్యం అని నమ్మేవారికి నేటికీ కొదవలేదు. నేడు మరోసారి.. ఉత్తర కర్ణాటక కలబుర్గీలోని తాజస్థాన్పుర గ్రామంలో ఇలాంటి మూఢనమ్మకమే కనిపించింది. సూర్యగ్రహణం సమయంలో దివ్యాంగ పిల్లలను గొయ్యి తీసి మెడ వరకు పాతి పెట్టారు కన్న తల్లిదండ్రులు.
వైకల్యం పోతుందట!
వైద్యులు నయం చేయలేని వైకల్యం సైతం.. గ్రహణం సమయంలో ఇలా గొయ్యిలో పాతి పెట్టడం వల్ల తనంతటతానే నయమవుతుందని వారి వింత నమ్మకం. అందుకోసం బాలలు ఏడిచిగింజుకుంటున్నా.. గ్రామస్థులు వారిని బయటకు తీసే ప్రయత్నం కూడా చేయలేదు. గ్రహణం పూర్తయ్యేంత వరకు పిల్లలను మట్టిలోనే పూడ్చి ఉంచారు. పైగా చుట్టూ జనం చేరి, గాలాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు.
నాలుగేళ్ల సంజన, ఆరేళ్ల పూజ, పదకొండేళ్ల కావేరిని దాదాపు మూడు గంటల పాటు ఇలా మట్టిలో కప్పి పెట్టారు. విద్యావంతులు ఎంత చెప్పినా గ్రామస్థులు వారి మొండి పోకడను మానుకోలేదు.
ఇదెక్కడి చోద్యం?
సూర్యగ్రహణం సమయంలో అతినీలలోహిత కిరణాలు భూమిని తాకుతాయి. ఆ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు కొందరు యాంటీ రేడియేషన్ గుణాలు కలిగిన గరిక(గడ్డి)ను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే, ఇలా వైకల్యం పోతుందనే నమ్మకానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అయినా.... మూలాల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను మాత్రం వదలట్లేదు జనాలు.
ఇదీ చదవండి:కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు!