చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్.. చంద్రుని ఉపరితలానికి 500 మీటర్ల సమీపం వరకు వెళ్లి కూలిపోయిందని అంతరిక్ష విభాగ సహాయమంత్రి జితేందర్ సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ల్యాండర్ అవరోహణ వేగాన్ని తగ్గించడంలో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.
"చంద్రుని దక్షిణ ధ్రువంలో పరిశోధనలు చేయడానికి ఇస్రో మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్-2ను ప్రయోగించింది. మొదటి దశలో చంద్రుని ఉపరితలం నుంచి 30 కి.మీ నుంచి 7.4 కి.మీ వరకు... ల్యాండర్ వేగాన్ని 1,683మీ/ సెకను నుంచి 146మీ/సెకన్‌కు తగ్గించారు. అక్కడ వరకు అంతా సాఫీగానే సాగింది.
రెండో దశలో విక్రమ్ ల్యాండర్ అవరోహణ వేగం నియంత్రించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అవరోహణ వేగం నిర్దేశించిన పారామితుల కంటే అధికంగా ఉండడం వల్ల చంద్రుని ఉపరితలానికి సుమారు 500 మీటర్ల దూరంలో ల్యాండర్ విఫలమైంది." - జితేంద్ర సింగ్, అంతరిక్ష విభాగం సహాయమంత్రి
విజయవంతమే..
విక్రమ్ ల్యాండింగ్‌లో సమస్య ఏర్పడినప్పటికీ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగ దశ, అంత్యంత క్లిష్టమైన కక్ష్య విన్యాసాలు, ల్యాండర్ వేరు పడడం, డీ-బూస్ట్, కఠినమైన బ్రేకింగ్ దశతో సహా అన్నీ విజయవంతంగా జరిగాయని ఆయన విశదపరిచారు.
మిషన్ జీవితం పెరిగింది...
శాస్త్రీయ లక్ష్యాలకు సంబంధించి.. ఆర్బిటర్‌లోని ఎనిమిది అత్యాధునిక సాధనాలు.. డిజైన్ ప్రకారం పనిచేస్తున్నాయని జితేంద్ర తెలిపారు. ఈ ఆర్బిటర్ చంద్రుని కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. ఆర్బిటర్ అత్యంత కచ్చితత్వంలో పనిచేస్తోందని, కనుక మిషన్ జీవితాన్ని ఏడు సంవత్సరాలకు పెంచినట్లు ఆయన లోక్‌సభకు వివరించారు.
నిరంతర సమాచారం
ఆర్బిటర్ నుంచి అందుతున్న డేటాను శాస్త్రీయ సమాజానికి నిరంతరం అందిస్తున్నామని జితేంద్ర స్పష్టం చేశారు. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ఆల్ ఇండియా యూజర్ మీట్లో ఇదే అంశాన్ని సమీక్షించామని ఆయన తెలిపారు.
చంద్రయాన్-2..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2019 జులై 22న చంద్రయాన్-2ను ప్రయోగించింది. దీనిలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఆగస్టు 20న చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా విడిపోయింది. అయితే చంద్రుని ఉపరితలంపై దిగడానికి కేవలం 500 మీటర్ల దూరంలో ల్యాండర్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై కూలిపోయింది.
ఇదీ చూడండి: చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం