రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా పెద్దలసభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత రాజకీయాల్లో పెద్దల సభ పాత్రను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వివరించారు. 1952లో హిందూ వివాహ చట్టం నుంచి.. 2019లో ముస్లిం మహిళల హక్కుల వరకు అనేక చట్టాలు చేశామని పేర్కొన్నారు. చేసిన పనులను గుర్తుచేసుకోవడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయమని వివరించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన వ్యాసాన్ని ప్రస్తావించారు రాజ్యసభ ఛైర్మన్. మరింత మెరుగ్గా పనిచేసేందుకు పలు సూచనలు చేశారు.
"1952 నుంచి ఇప్పటివరకూ జరిగిన 249 సెషన్లలో 5466 సార్లు సమావేశమయ్యాం. 3,870 బిల్లులకు ఆమోదం తెలిపాం. వీటిలో దేశ సామాజిక, ఆర్థిక స్వరూపాన్ని మార్చిన అనేక చట్టాలున్నాయి. 1952 నుంచి రాజ్యసభ... శాసన నిర్మాణ ప్రక్రియకు మార్గదర్శకత్వం చేయడమే కాకుండా... ఆత్రుత, తొందరపాటుతో తీసుకువచ్చే బిల్లులను నిరోధిస్తూ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తోంది. బిల్లులను వ్యతిరేకించే విషయంలో, ఆమోదించే అంశంలో సమతుల్యతను పాటించాల్సిన అవసరముంది. లోక్‌సభ ఆమోదించే ప్రతీ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ అడ్డంకిగా మారకూడదు. అదే సమయంలో లోక్‌సభ ఆమోదించే ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతూ రబ్బర్‌స్టాంప్‌గా కూడా మారకూడదు." - వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్
- ఇదీ చూడండి: రాజ్యసభ 250వ సెషన్.. మోదీ 'ప్రత్యేక' ప్రసంగం