విదేశీ విరాళాల నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్ఛంద (ఎన్జీఓ) సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు చేసింది. బెంగళూరు, దిల్లీల్లోని 4 సంస్థ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియా ఫౌండేషన్లపై కేసు నమోదు చేసింది సీబీఐ.
గత కేసులో అనుసంధానించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు, విదేశీ సహాయ నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ), 2010లో హోం మంత్రిత్వశాఖ ఎన్జీఓ లైసెన్స్‌కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.
'భారత చట్టాలకు కట్టుబడి ఉన్నాం'
అయితే భారత చట్టాలకు కట్టుబడి ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులపై పోరాటం చేయటం తన విధి అని వెల్లడించింది. విదేశీ మారక ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థపై దాడులు చేసింది.
ఫెమా చట్టానికి విరుద్ధంగా యూకే కేంద్రంగా నడిచే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి, యూకేకు చెందిన ఇతర సంస్థల నుంచి వాణిజ్య మార్గాల ద్వారా నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించింది.
ఇదీ చూడండి:రేపు తెరుచుకోనున్న శబరిమల దేవాలయం