కీలక మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ ఆయుధ కర్మాగారాల అలసత్వం మరోసారి బయటపడింది. సైన్యం అవసరాలకు సరిపడిన సంఖ్యలో ఈ సామగ్రిని సరఫరా చేయడంలో ఇవి విఫలమయ్యాయని ‘కాగ్’ తన తాజా నివేదికలో ఆక్షేపించింది. దీని వల్ల రక్షణ సన్నద్ధతకు ఇబ్బంది ఏర్పడుతోందని పేర్కొంది. పదేళ్ల కిందటే ‘కాలం చెల్లినట్లు’గా తేల్చిన మందుగుండు సామగ్రిని భారత సైన్యంపై రుద్దుతున్నట్లు విమర్శించింది.
టి-72, టి-90 ట్యాంకులు, సాయుధ శకటాలు, విమాన విధ్వంసక తుపాకులు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లలో ఈ మందుగుండును ఉపయోగిస్తున్నారు. వీటిలో ఫ్యూజులు ఉంటాయి. మందు గుండును పేల్చడానికి ఇవి అవసరం. ఇందులో మెకానికల్, ఎలక్ట్రానిక్ అనే రెండు రకాల ఫ్యూజులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూజులు అత్యంత విశ్వసనీయమైనవి. చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. వీటి బరువు కూడా తక్కువే. పాశ్చాత్య దేశాలు, భారత్‌కు పొరుగునున్న అనేక దేశాలు వీటినే ఉపయోగిస్తున్నాయి.
భారత్ సైన్యం కూడా 1993 నుంచి ఎలక్ట్రానిక్ ఫ్యూజుల వైపు మళ్లడం మొదలు పెట్టింది. మెకానికల్ ఫ్యూజులను ‘కాలం చెల్లినవి’గా 2009లో ప్రకటించింది. అయితే ప్రభుత్వ రంగంలోని ఆయుధ కర్మాగారాలు ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూజులను సరిపడా సరఫరా చేయడంలో విఫలం కావడంతో భారత సైన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కొరతను అధిగమించడానికి మెకానికల్ ఫ్యూజుల వాడకానికీ అనుమతినిచ్చింది. దీనికితోడు ఎలక్ట్రానిక్ ఫ్యూజుల్లో దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఎక్కువగా ఉంటున్నాయని కూడా కాగ్ ఆక్షేపించింది. 2017-18లో ఈ ఆయుధ కర్మాగారాలు 49 శాతం ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే తమ లక్ష్యాలను అందుకున్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి: అయోధ్య పరిధిలో మసీదు నిర్మించొద్దు: వీహెచ్పీ