దేశ రాజధాని దిల్లీలో తీవ్రరూపం దాల్చిన కాలుష్య భూతాన్ని అరికట్టడానికి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీ.కే మిశ్రా. దిల్లీ, హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలతో కలిసి కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా రోజువారీగా పరిస్థితిని సమీక్షించాలని సమావేశంలో నిర్ణయించారు.
వరిగడ్డి, వ్యర్థాల కాల్చివేత, వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యం సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న విషయాలపై ఆయన చర్చించారు. పంజాబ్, హరియాణా, దిల్లీకి చెందిన సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల వారిగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు మిశ్రా.
దిల్లీలో కాలుష్య నియంత్రణకు 300 బృందాలు పనిచేస్తున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలకు కూడా అవసరమైన సామాగ్రిని అందించామని వెల్లడించారు. ట్రాఫిక్ అధికంగా ఉండే మార్గాలు సహా కాలుష్యం అధికంగా వెలువడే ఏడు పరిశ్రమల సమూహాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.