'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)' పదవి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక నుంచి త్రివిధ దళాలకు అధిపతిగా, మూడు రక్షణ సంస్థల తరఫున ప్రభుత్వానికి సలహాదారుగా సీడీఎస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దేశంలోని మూడు రక్షణ వ్యవస్థలకు నాయకుడిగా సీడీఎస్‌ను తీసుకురానున్నట్లు ఈ ఏడాది ఆగస్టు 15నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కాగా నేడు సీడీఎస్ ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
సీడీఎస్‌గా రావత్!
సీడీఎస్ విధివిధానాలకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ నేతృత్వంలోని బృందం ఓ నివేదికను రూపొందించింది. ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆ నివేదికకు ఆమోదం తెలపగా.. ఈ పదవి కోసం ప్రస్తుతమున్న త్రివిధ దళాల అధిపతుల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో పదవీ విరమణ చేయనున్న సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్.. ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31న రావత్ పదవీ విరమణ చేయనున్నారు.
ఇదీ చూడండి : 2020 ఏప్రిల్ నుంచి 'జాతీయ జనాభా పట్టిక' ప్రక్రియ