ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్‌పీఆర్)పై కీలక నిర్ణయం తీసుకుంది. అసోం మినహా దేశవ్యాప్తంగా ఎన్‌పీఆర్ అప్డేట్ చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటాయించింది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ఎన్పీఆర్ను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. స్వాతంత్య్ర భారతంలో జనగణన చేపట్టడం ఇది 16వ సారి కానుంది.
ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'
ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాల్సిందే..
జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. దేశంలోని ప్రతి పౌరుడు ఎన్పీఆర్లో నమోదు చేసుకోవడం అత్యంత అవసరం.
ఎలాంటి పత్రాలు అవసరం లేదు
ఎన్‌పీఆర్ కోసం బయోమెట్రిక్, ఆధార్ సహా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. స్వీయధ్రువీకరణ సరిపోతుంది. కొత్తగా రూపొందించిన యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
ఎన్‌పీఆర్ ఎందుకు?
దేశంలోని పౌరుల వివరాలు సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరవేయడమే ఎన్‌పీఆర్ లక్ష్యం. ఎన్‌పీఆర్ సిద్ధమైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్‌ఆర్‌సీ)ను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. 2021లో మరోసారి జనాభా గణన చేయనున్నారు ఇందుకోసం రూ. 8,754 కోట్లు కేటాయించింది. అంతకంటే ముందే 2020లోనే ఎన్పీఆర్ను రూపొందించనున్నారు.
ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'