వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రిర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం.. ఈ బిల్లుకు పచ్చ జెండా ఊపింది. పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ నుంచి వలసవచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ బిల్లు వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈశాన్య రాష్ట్రాల్లోని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ భయాలను దూరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు, పౌర, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఇటీవల భేటీ అయ్యారు. వారి సందేహాలను నివృతి చేశారు.
మరిన్ని కీలక నిర్ణయాలు...
- చట్టసభల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు.
- వ్యక్తిగత సమాచార భద్రత బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.
- జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల చట్టం సవరణ బిల్లు ఉపసంహరణకు నిర్ణయం.
- దిల్లీ ప్రగతి మైదానంలోని 3.7 ఎకరాల భూమి లీజుకివ్వాలని మంత్రివర్గం నిర్ణయం. ఆ స్థలంలో 5 నక్షత్రాల హోటల్ నిర్మాణానికి అనుమతి.
- ప్రభుత్వ రంగ సంస్థలకు మరింత నగదు అందుబాటులో ఉంచేందుకు భారత్ బాండ్ ఈటీఎఫ్ పథకం ప్రారంభానికి మంత్రివర్గం ఆమోదం.
ఈ నిర్ణయాలకు సంబంధించిన బిల్లులన్నింటినీ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి: మంచు కొండలు విరిగిపడి ఐదుగురు జవాన్లు మృతి