ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన 1995 గెస్ట్‌హౌస్ కేసు ఉపసంహరణకు బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌పై కేసును ఉపసంహరించుకోవాలని బీఎస్పీ ప్రధాన కార్యదర్శిని మాయావతి ఆదేశించారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
"ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ములాయంపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని అఖిలేశ్ యాదవ్ కోరారు. సతీశ్ మిశ్రాను ఈ మేరకు సుప్రీంలో దరఖాస్తు చేయాలని మాయావతి ఆదేశించారు."
- పార్టీ వర్గాలు
ఆ రోజు ఏ జరిగింది..
1995 జూన్ 2న ప్రభుత్వ ఏర్పాటులో ఎస్పీకి... మాయావతి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మాయావతిపై ఆగ్రహంతో ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపేశారు. అప్పుడు తాను ఓ గదిలో దాక్కోవాల్సి వచ్చిందని మాయావతి పలుమార్లు ప్రస్తావించారు.
ఆగ్రహంతో ఉన్న ఎస్పీ కార్యకర్తల నుంచి భాజపా చట్టసభ్యుడు బ్రహ్మదత్ ద్వివేదీ వచ్చి ఆమెను కాపాడారు. ఈ ఘటన తర్వాత రెండు పార్టీల మధ్య చాలా అంతరం పెరిగింది. 20 ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీని విమర్శించే ప్రతిసారి మాయావతి ఈ అంశాన్ని లేవనెత్తేవారు.