ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అసత్యవాదిగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై భాజపా మండిపడింది. అబద్ధాలు చెప్పడంలో రాహుల్ దిట్ట అని విమర్శించారు భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా. మోదీపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు.
తొలుత భారత్లో నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతమాతతో ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. అసోంలో నిర్మితమవుతోన్న ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్లో పంచుకున్నారు.
దీనిపై స్పందించిన సంబిత్ పాత్రా.. 2011లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే అసోంలో నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.
"రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అసోంలో మూడు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది."
-సంబిత్ పాత్రా.
నిర్బంధ కేంద్రాలు, జాతీయ పౌర పట్టిక మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఇదీ చూడండి : 'జాతీయ జనాభా పట్టిక-2020 ప్రమాదకారి'