మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం అనూహ్య రీతిలో కొలువు తీరడం వెనక అనేక కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాజపా మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు నమ్మిన బంటుగా ఉన్న ఆయన ప్రభుత్వ ఏర్పాటులో అంతా తానై చక్రం తిప్పారు. గత కొన్ని రోజులుగా అజిత్ పవార్‌తో భూపేంద్ర యాదవ్ రహస్య చర్చలు జరుపుతూ వచ్చారు. భూపేంద్ర మంత్రాంగం ఫలించి శుక్రవారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు భాజపా-అజిత్ పవార్ మధ్య ఒప్పందం కుదిరింది.
శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకు తెలిసేలోగానే ప్రమాణస్వీకారం జరిగేలా చూడాలని దేవేంద్ర ఫడణవిస్ కోరడంతో రెండు పార్టీల నేతలు వేగంగా పావులు కదిపారు. రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని రాత్రి 2.10 గం.కు గవర్నర్ కార్యదర్శి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి సందేశం వెళ్లింది. ఆ వెంటనే ఉదయం 5 గంటల30 నిమిషాలకు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ రాజ్‌భవన్ చేరుకున్నారు. అనంతరం ఉదయం 5 గంటల 47 నిమిషాలకు రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ పిదప ఉదయం 7గంటల50నిమిషాలకు ఫడణవీస్, అజిత్‌తో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు.
ఇదీ చూడండి : కారు ఎక్కి గుండ్రంగా చక్కర్లు కొట్టిన శునకం!