ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే 'నో షేవ్ నవంబర్' ఉద్యమానికి భారత్‌లోనూ మంచి ప్రచారం లభిస్తోంది. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు సేకరించే.. ఈ వినూత్న ప్రయత్నాన్ని కేరళ బియర్డ్ సొసైటీ అవలంబిస్తోంది.
ఈ 'నో షేవ్ నవంబర్' ఉద్యమంలో భాగంగా కేరళ కన్నూర్ జిల్లాలోని ఓ గడ్డం గ్యాంగ్... సామాజిక సేవ చేసేందుకు పూనుకుంది. యువకులందరూ క్షవరం, గడ్డం చేసుకోకుండా మిగిల్చిన డబ్బును సేకరించి పలు రకాల సామాజిక అవసరాల కోసం విరాళంగా ఇస్తున్నారు. దాదాపు రూ. 4 లక్షలు విరాళంగా సేకరించడం విశేషం. ఇలా చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ నిధుల్ని వైద్య సహాయం, పేదలకు గృహ నిర్మాణం, ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలు, వైద్య శిబిరాలను నిర్వహించడం వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
'నో షేవ్ నవంబర్' మంచి కోసమే?
పాశ్చాత్య దేశాల్లో ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. అక్కడ నుంచే మన దేశానికీ ఈ సంప్రదాయం వచ్చింది. ప్రచారంలో భాగంగా అక్కడ నవంబరు నెల గడ్డం గీసుకోరు. షేవింగ్ చేసుకోకుండా మిగిల్చిన సొమ్మును కేన్సర్ బాధితులకు విరాళంగా అందిస్తారు. ఇలా మన దేశంలో కూడా కొంత మంది దీన్ని పాటిస్తూ తమ విరాళాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తున్నారు.
ఇదీ చూడండి : అసోంలో నిరసనకారులపై పోలీసుల కాల్పులు