దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద ఆర్డీఎక్స్ బ్యాగ్ కలకలం రేపింది. భద్రతా కారణాల రీత్యా పోలీసులు రెండు గంటలపాటు ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల తరువాతే ప్రయాణికులను బయటకు వెళ్లడానికి అనుమతించారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో విమానాశ్రయంలోని మూడో టెర్మినల్ గేట్ నెంబర్ 2 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ నల్లని రంగు సంచిని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని.. అక్కడ నుంచి తరలించారు.
ఆర్డీఎక్స్ ఉందా?
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంచిలో ఆర్డీఎక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బాంబ్ డిటెక్టర్, శునకాలతో తనిఖీ చేశారు. అయితే ఈ పేలుడు పదార్థం కచ్చితమైన స్వభావం ఇంకా నిర్ధరణ కాలేదని, 24 గంటల తరువాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ బ్యాగ్‌లో ఉన్నది పేలుడు పదార్థమేనని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రతో ఎంత లాభమో!