అసోం గువాహటిలో పౌరసత్వ చట్ట సవరణపై పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూను ఇవాళ తాత్కాలికంగా సడలించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సడలింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అసోంలో కేంద్ర సాయుధ దళాలకు సహాయంగా 26 సైనిక పటాలాలు కూడా మోహరించి ఉన్నాయి.
నిరసనల నడుమే చట్టం..
2019 పౌరసత్వ చట్ట సవరణ బిల్లును బుధవారం పార్లమెంట్ ఆమోదించిన తరువాత ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అసోంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ పరిస్థితుల నడుమే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఈ బిల్లుపై సంతకం చేసి చట్టంగా మార్చారు.
ఈ చట్టం ద్వారా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడానికి వీలవుతుంది. 2014 డిసెంబర్ 13 వరకు, లేదా అంతకు ముందు వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జొరాస్ట్రియన్ వర్గాల శరణార్థులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభిస్తుంది.
ఉక్కుపాదం..
గురువారం పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. మరోవైపు అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవల నిలుపుదలను మరో 48 గంటలపాటు పొడిగించారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ భూతంపై 'స్లమ్‌డాగ్ సైంటిస్టు'ల రోబో అస్త్రం