పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య భారతంలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. అసోం గువహటిలో కర్ఫ్యూ నిబంధనలను లెక్కచేయకుండా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. లూలుంగావ్ ప్రాంతంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ అఖిల అసోం విద్యార్థి సంఘం(ఆసు), ఈశాన్య విద్యార్థి సంఘం(నెసో), క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి ఆందోళనలకు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 12ను బ్లాక్ డేగా ప్రకటించాయి. లతాశిల్ మైదానంలో మహా సభను ఏర్పాటుచేశారు. వందలమంది ఈ సభకు హాజరయ్యారు.
అసోం సినీరంగానికి చెందిన నటీనటులు పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు.
పలు ప్రాంతాల్లో హింస
గువహటిలోని పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువహటి-షిల్లాంగ్ రహదారి రణరంగంగా మారింది. నిరసనకారులు దుకాణాలను మూసేశారు. రోడ్లపై టైర్లు కాల్చారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. గువహటి సహా దిబ్రూగడ్, జోర్హాత్, తిన్‌సుకియా ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. పలుప్రాంతాల్లోనూ నిరసనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపింది. కామ్రూప్, గోల్ఘాట్ జిల్లాల్లో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి.
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
దిబ్రూగఢ్‌లోని చబువాలో స్థానిక ఎమ్మెల్యే వినోద్ హజారికా ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న వాహనాలు తగలబెట్టారు.
గువహటి అంబారీ ప్రాంతంలోని అసోం గణపరిషత్ పార్టీ ప్రధాన కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. బయట నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు.
అంతర్జాలం బంద్
అంతర్జాల సేవలను మరో 48 గంటలపాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టి, శాంతిభద్రతలు పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌరసత్వ బిల్లుపై తీవ్ర నిరసనల నేపథ్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు అసోంలోని 10 జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.
రైళ్లు, విమానాలకు బ్రేకులు
నిరసనల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అసోం, త్రిపురలో రైళ్లు నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే విమానాలు రద్దయ్యాయి.
అంతా అప్రమత్తం
ఆందోళనలు ఉద్ధృతంగా మారిన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక మార్పులు చేసింది అసోం ప్రభుత్వం. శాంతి భద్రతల అదనపు డీజీపీ ముకేశ్ అగర్వాల్‌ను సీఐడీకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జీపీ సింగ్‌ను నియమించింది. గువహటి పోలీస్ కమిషనర్‌గా దీపక్ కుమార్‌ను తప్పించి, మున్నా ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది.
కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా అసోంకు ఐదు కంపెనీల సైనిక బలగాలను, త్రిపురకు మూడు కంపెనీల అసోం రైఫిల్స్ బలగాలను తరలించింది.
ఇదీ చూడండి: 'ఈశాన్య ప్రజల ప్రయోజనాలే భాజపాకు పరమావధి'