భూతాపం గతి తప్పుతోంది. ఫలితంగా తరచూ క్షామం, అకాల వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వ్యవసాయం కుంటువడుతోంది. ధ్రువ ప్రాంతాలు, హిమశిఖరాలపై మంచు ఫలకాలు వేగంగా కరిగి సముద్రమట్టం పెరిగిపోతోంది. గ్రీన్‌లాండ్‌పై మంచు ఇంతకుముందుకంటే ఏడు రెట్లు వేగంగా కరుగుతోందని అంచనా. ఉత్తర ధ్రువ ప్రాంతాలైన సైబీరియా, అలస్కా, ఉత్తర కెనడాల్లో అడవులు మండుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండంలోని అడవంతా మంటల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 2-13 మధ్య ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పారిస్ ఒప్పందానికి కొనసాగింపుగా జరిగిన 25వ సదస్సు ప్రమాద నివారణకు నిర్దిష్ట చర్యల దిశగా ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైంది. కర్బన ఉద్గారాల్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలేవీ ముందడుగు వేయలేకపోయాయి. 2020 డిసెంబరు నాటికి కర్బన ఉద్గారాలను తగ్గుముఖం పట్టించి, 2030 నాటికి 45 శాతందాకా తగ్గించకపోతే ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం అసాధ్యం. ఈ ప్రక్రియ ఆలస్యమైనకొద్దీ చమురు, బొగ్గులను త్యజించాల్సిన స్థాయి మరింతగా పెరిగి లక్ష్యసాధన క్లిష్టమవుతుంది.
ముంచుకొస్తున్న ముప్పు
ప్రభుత్వాలు ఇంధన కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ మానవ జాతి మనుగడకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని విస్మరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలు తమ నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తులుగా భూతాపం నివారణకు తీసుకోగల చర్యలపై అంతర్జాతీయంగా చాలా చర్చ జరిగింది, జరుగుతోంది. ఈ సమస్యకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, శిలాజ ఇంధన శక్తి ప్రధానమైన ఉత్పత్తి విధానాలే ముఖ్యకారణం. భూతాపాన్ని నిరోధించడానికి విధానాల మార్పు తప్పనిసరి. సంపన్న, అతి సంపన్న వర్గాల వినిమయ జీవన శైలి కారణంగా విడుదలయ్యే కర్బనం కూడా కీలకమే. వ్యక్తిగత స్థాయిలో చాలామంది సమస్యకు కారణం కాకపోవచ్చు. కానీ, అవగాహన పెంచుకుని సమస్య కారణాల్లో మన పాత్ర తగ్గించుకోవడానికి ప్రయత్నించడం అవసరం. ప్రజాస్వామ్యాల్లో మార్పు సమష్టి కృషితోనే సాధ్యం. వ్యక్తిగత మార్పులు సమష్టి ఉద్యమానికి ప్రేరణగా, చైతన్యంగా మారినప్పుడే మార్పు సుసాధ్యమవుతుంది. ఎందుకంటే మనదేశంలో 90 శాతం మంది జీవన శైలి భూతాపానికి కారణం కాదు. కానీ, ముందుగా బాధితులుగా మారుతున్నది వీరే కనుక భూతాపాన్ని అరికట్టడమే శ్రేయస్కరం. మాంసాహారం, విమానయానం, కారు వాడకాల్ని తగ్గించడం ద్వారా భూతాపాన్ని ఎంతోకొంత తగ్గించినవారం అవుతామనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి దిల్లీకి విమానంలో వెళ్లి వస్తే 0.34 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదల అవుతుంది. హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లి వస్తే 3.93 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. కారు వాడటాన్ని మానేస్తే ఏటా 2.4 టన్నుల మేర బొగ్గు పులుసు వాయువు విడుదల ఆగుతుంది. అమెరికా జీవన విధానం ప్రకారమైతే ఒక బిడ్డ తగ్గితే ఏటా 58.6 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గుతుంది. కాకపోతే, ఈ వాదన విషయంలో తీవ్రస్థాయి విమర్శలున్నాయి.
భూతాపం ముప్పు మానవ అస్తిత్వానికే ప్రమాదంగా పరిణమిస్తోంది. మనిషి వేట-సేకరణ దశలో జీవించిన 2.90 లక్షల సంవత్సరాలు సుస్థిరంగానే జీవించాడు. వ్యవసాయంతో నాగరిక సమాజ నిర్మాణ దిశగా అడుగులు వేసిన నాటి నుంచి (పది వేల ఏళ్లలో) ఎన్నో నాగరికతలు ఉద్భవించి, పరిఢవిల్లి, పతనమయ్యాయి. ప్రస్తుత పారిశ్రామిక నాగరికత వయసు 300 ఏళ్లలోపే. ఇంత తక్కువ కాలంలో మనిషి అస్తిత్వానికే సవాలుగా మారిన ఈ నాగరికత కొనసాగింపు అభిలషణీయం కాదు. పతనమైన నాగరికతల నుంచి మనకు కనిపించే వాస్తవం ప్రకృతి నుంచి మనిషి వేరుపడటం. ప్రస్తుత నాగరికతలో వేరుపడటం పరిపూర్ణమైంది. ప్రకృతిలో పరిణామం చెంది జీవం పోసుకున్న మనం... ప్రకృతి నుంచి విడివడి మనుగడ సాగించలేమన్న నిజాన్ని గుర్తెరగాలి. ప్రకృతి సూత్రాలకు లోబడి జీవించడమనే సమాజ తాత్విక పునాదిని ఆచరణీయంగా మార్చుకోక తప్పదు. ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) తన నివేదికలో ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలు మించకుండా ఆపేందుకు సత్వరమే అసాధారణ స్థాయిలో మార్పులు రావడం అవసరమని తెలిపింది. ఈ విషయంలో అవసరమైన మార్పులు తేగలిగేది ప్రజలే. భూతాప సంక్షోభానికి బాధ్యులుకాని ప్రజలు కూడా వ్యక్తిగత మార్పుల్ని ఆచరించాల్సి ఉంటుంది. వ్యవసాయదారులు రసాయన సాగుకు ముగింపు పలకాలి. ఆధునిక వ్యవసాయం దిగుబడి పెంచినా- నేలను నిస్సారం చేసింది, నీటిని కలుషితం చేసింది, జీవ వైవిధ్యాన్ని నాశనం చేసింది. కోట్లాది టన్నుల మట్టిని సముద్రం పాలు చేసింది. అనారోగ్యాన్ని పెంచింది. అన్నింటికీ మించి రైతును మార్కెట్‌కి బానిసగా మార్చింది. కర్బన ఉద్గారాలను కట్టడి చేసినా వ్యవసాయంలో విడుదలయ్యే కర్బనాన్ని ఆపకుండా భూతాపాన్ని నిరోధించలేమనేది నిపుణులు చెబుతున్న మాట. పెరుగుతున్న జనాభా, ఆహార అవసరాల దృష్ట్యా, వ్యవసాయంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం తప్పనిసరి. వ్యవసాయంలో మార్పుల ద్వారా నేలలో కర్బనాన్ని పెంచి, గాలిలోని కర్బనాన్ని 25 శాతం తగ్గించవచ్చని రోడేల్ సంస్థ అంచనా. ఇందుకోసం నేలలో కర్బనాన్ని పెంచే వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించాల్సి ఉంటుంది.
అభివృద్ధి ఫలాలు కొందరికే...
ప్రస్తుత రాజకీయ, ఆర్థిక విధానాలు సామాజిక, ఆర్థిక అసమానతలను పెంచుతున్నాయి. ఆక్స్‌ఫాం సంస్థ నివేదిక ప్రకారం 10 శాతం సంపన్నులకు జాతి సంపదలో 77 శాతం వాటా ఉండగా, మిగిలిన 90 శాతం ప్రజలందరి వాటా 23 శాతమే. అమెరికాలో 10 శాతం సంపన్నుల వాటా 77.2 శాతం. మిగిలిన 90 శాతం ప్రజల వాటా సంపదలో 22.8 శాతమే. అది 2050నాటికి సున్నాగా మారుతుందని ఆర్థికవేత్తల అంచనా. ఆధునిక జీవనం విలాసవంతమైన జీవితాలకు ఎన్నో సౌలభ్యాలు కల్పిస్తున్నా అవి పది శాతానికే అందుబాటులో ఉంటాయి. ప్రపంచ జనాభాలో 90 శాతం చాలావరకు సాధారణ జీవనాన్నే గడిపేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక విధానాల కొనసాగింపు వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం దక్కకపోగా, వారి అస్తిత్వానికే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. భూమిపై మనిషి మనుగడ సాగేందుకు భూతాప ప్రమాదాన్ని నివారించగల ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులు అనివార్యం. మన ఉనికిని కాపాడుకోవడానికి మనవంతు ప్రయత్నం తప్పదు!
- డాక్టర్ కలపాల బాబూరావు (రచయిత- పర్యావరణ రంగ నిపుణులు)
ఇదీ చూడండి: కాలాపానీపై భారత్‌తో చర్చలకు ఏర్పాట్లు: నేపాల్