మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. భాజపాతో మైత్రి తెగదెంపులు చేసుకున్న శివసేన... ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన విచక్షణతో అన్ని సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని అంటున్నారు. అన్ని సమీకరణాలు విఫలమైతే తప్ప... రాష్ట్రపతి పాలనకు గవర్నర్ మొగ్గు చూపే అవకాశం లేదని చెబుతున్నారు.
రాష్ట్రంలో స్థిరమైన అధికారం ఉండటమే గవర్నర్ ప్రధాన లక్ష్యమని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత కాంగ్రెస్ నేత జస్టిస్ అభయ్ థిప్సే అభిప్రాయపడ్డారు. ప్రతిష్టంభన పరిస్థితుల్లో.. గవర్నర్ అనుసరించాల్సిన పద్ధతులపై రాజ్యాంగంలో ఎలాంటి నియమాలు లేవని గుర్తు చేశారు.
"సాధారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తారు. వాళ్లు సిద్ధంగా లేకపోతే.. తర్వాతి స్థానంలో ఉన్న పార్టీని పిలుస్తారు. అధికారం చేపట్టడానికి పార్టీలకు ఎంత సమయం ఇవ్వాలనేది గవర్నర్ ఇష్టం."
--- జస్టిస్ అభయ్ థిప్సే, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి.
అయితే పొత్తుతో ఎన్నికల బరిలో దిగిన పార్టీలను పిలిచి... 'ఒక్క పార్టీగా' కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఇరు పక్షాల నేతలకు పిలుపునిచ్చే అధికారమూ గవర్నర్కు ఉందని గుర్తుచేశారు జస్టిస్ అభయ్.
మహా మలుపులు...
తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ దళానికి అవకాశమిచ్చారు భగత్ కోషియారీ. శివసేన మద్దతు లేకపోవడం వల్ల భాజపా చేతులెత్తేసింది. అనంతరం... శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శివసేన కుడా విఫలమైతే ఎన్సీపీ(మూడో అతిపెద్ద పార్టీ)ని పిలవడం, లేకపోతే భాజపా-సేన నేతలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం.. గవర్నర్ ముందున్న మరిన్ని ప్రత్యామ్నాయాలు. ఇవన్నీ విఫలమైతే.. మిగిలింది రాష్ట్రపతి పాలనే.