ఇంట్లో సహా పరిసరాల్లో అధిక మొత్తంలో వెలువడే కాలుష్యాన్ని పీల్చడం ద్వారా ప్రమాదకర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గుండె పోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు స్పెయిన్కు చెందిన బార్సిలోనా ఇన్స్టిట్యుట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ బృందం పరిశోధనలో వెల్లడైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ బృందం తొలిసారిగా గాలి కాలుష్యం... కారొటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్(రక్త నాళాలు గట్టి పడటం (సీఐఎంటీ)) వంటి సమస్యలకు కారణమవుతుందని రుజువు చేసింది.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 3,372 మందిపై ఈ బృందం పలు పరిశోధనలు చేసింది. ఎక్కువగా కాలుష్యం బారిన పడేవారికి అధిక సీఐఎంటీ ఉంటుందని పేర్కొంది. అంటే వీరికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. కాలుష్యానికి గురికావడం సహా సీఐఎంటీని అంచనా వేయడానికి ఈ బృందం ల్యాండ్ యూజ్ రిగ్రెషన్ అనే అల్గారిథంను ఉపయోగించింది.
సంవత్సర కాలంలో అత్యధికంగా కాలుష్య ప్రభావానికి గురైన వ్యక్తుల్లో అధిక సీఐఎంటీ ఉంటుందని, దీని ద్వారా అధిక ముప్పు పొంచి ఉంటుందని పరిశోధన వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న 40 ఏళ్లు పైబడిన పురుషులలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 60 శాతానికి పైగా వంటకోసం బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది.
'వంట కోసం బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్న ప్రజలలో అధిక సీఐఎంటీ ఉంది. సరైన గాలి ప్రసరణ లేని ప్రదేశాలలో వంట చేసే మహిళల్లో సీఐఎంటీ మరింత ఎక్కువగా ఉంది. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో అధిక సీఐఎంటీ గుర్తించాం. వారు ఎక్కువ సేపు వంట గదిలో కాలుషిత గాలిని పీల్చడమే ప్రధాన కారణం.'
--ఒటావియో రంజని, పరిశోధకుడు
ఈ అధ్యయనం ప్రత్యేకంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న భారత్ వంటి దేశాలకు సంబంధించినదని పరిశోధకులు తెలిపారు. అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో మరిన్ని పరిశోధనలు చేయాలని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.