ఆయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డిసెంబర్ 9 లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. అయితే రివ్యూ పిటిషన్ ఎవరి తరపున, ఎప్పుడు వేస్తామన్న విషయాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించమని చెప్పింది.
'సున్నీ' ప్రభావం మాపై ఉండదు..
అయోధ్యపై సుప్రీం తీర్పును సవాలు చేయకూడదంటూ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు తీసుకున్న నిర్ణయం తమను ప్రభావితం చేయదని బోర్డు కార్యదర్శి జాఫర్‌యాబ్ జిలానీ అన్నారు. సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నవంబర్ 17న జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సంస్థలన్నీ తమవైపే ఉన్నాయని పేర్కొన్నారు.
బెదిరిస్తున్నారు..
సమీక్ష పిటిషన్ దాఖలు చేస్తే కటకటాలపాలు చేస్తామని అయోధ్య పోలీసులు తమ తరపు న్యాయవాదులను, ముస్లిం పార్టీ (సంస్థలను) బెదిరిస్తున్నారని జిలానీ ఆరోపించారు. ఈ విషయాన్ని సమీక్ష పిటిషన్లోనూ పేర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇలా ముగిసింది..
దశాబ్దాలగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ్‌లల్లాకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: హిమాచల ప్రదేశం... శ్వేతవర్ణ శోభితం