సాధారణంగా హిందువులు నిశ్చితార్థం రోజు రాసుకున్న లగ్న పత్రిక ప్రకారం పెళ్లి జరిపించడం ఆనవాయితి. అయితే ఏ కారణాలతోనైనా పెళ్లి వాయిదా వేసే వెసులుబాటు ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్లోని గద్దీ సామాజిక వర్గం వారి ఆచారం ప్రకారం పెళ్లి వాయిదా పడే అవకశామే లేదు. ఆరు నూరైనా సరే.. వారు రాసుకునే దస్తావేజుల్లో ఉన్న తేదీకి వివాహ కార్యక్రమాలు జరగాల్సిందే.
లిఖిత పూర్వకంగా.. లిఖ్నోత్రీ
ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం చూస్తే.. గద్దీ వారి వివాహ సంప్రదాయంలోని విశేషాలు ఔరా అనిపించక మానవు. చంబా జిల్లాలో విస్తారంగా ఉండే గద్దీ వర్గంలో పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు దస్తావేజులు రాసుకోవాలి. గద్దీ భాషలో ఇలా రాసుకునే ఈ లగ్న పత్రికను లిఖ్నోత్రీ అంటారు.
ఇదే తొలి ఘట్టం
ఈ తొలి ఘట్టంలో వధూవరుల కుటుంబాలు కలిసి మందిరం వద్దకు వెళ్తారు. అక్కడ పురోహితుడు ఓ పత్రం రాస్తాడు. ఇందులో మంగళస్నానాల సమయం, కన్యాదానం చేయాల్సిన ముహుర్తం నుంచి వధువు.. వరుడి ఇంట్లో కాలుపెట్టే తేదీ వరకు అన్ని ముఖ్య ఘట్టాల రాస్తారు.
శివాజ్ఞే వేదం
గద్దీ సామాజిక వర్గం వారు ఏ శుభకార్యం అయినా భోలేనాథుని సమక్షంలోనే జరిపిస్తారు. అందుకే ఆయన సాక్షిగానే ఈ పెళ్లి దస్తావేజులు రాస్తారు. ఈ పత్రాలను ఇరు కుటుంబాలకు అందజేస్తారు. ఆ తేదీల ప్రకారమే వారు పెళ్లి కార్యక్రమాలు జరిపించాలి.
ఎవరు చనిపోయినా పెళ్లి ఆగదు...
పెళ్లి ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా.. చివరికి ఆ ఇంట్లో ఎవరు మరణించినా సరే లిఖ్నోత్రీలో రాసిన తేదీ ప్రకారమే వరుడు వదువును పెళ్లిచేసుకుని తీరాలి. ఏ కారణంతోనైనా పెళ్లి వాయిదా వేస్తే ఇరు కుటుంబాలు శివుని ఆగ్రహానికి బలికావాల్సిందేనని వీరి నమ్మకం.
ఇది ఎన్నో శతాబ్దాలుగా పాటిస్తున్న ఆచారమే అయినా.. ఇప్పటి వరకు ఒక్కసారీ వివాహం రద్దు అయిన దాఖలాలు లేవు. ఇదంతా కేవలం శివ ఆశీర్వాదంతో లిఖించిన దస్తావేజుల వల్లే అంటున్నాయి గద్దీ వర్గాలు.
ఇదీ చూడండి: ఆకులపై చెక్కినా.. చెక్కుచెదరని చిత్ర కళ