మహారాష్ట్రలో శివసేన కొత్త శకాన్ని ఆరంభించనుంది. శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఠాక్రే వంశం నుంచి బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రే ఘనవిజయం సాధించారు. 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానేను ఓడించారు. పార్టీకి నూతనోత్తేజం తీసుకొచ్చారు.
అయితే... శివసేన వ్యూహాత్మక వైఖరితో ఆదిత్య సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా..? భాజపా ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే జరిగితే దశాబ్దాలుగా ప్రభుత్వ పదవులకు దూరంగా ఉన్న ఠాక్రే వంశ చరిత్రలో కీలక మలుపు చోటుచేసుకోనుంది.
బాల్ ఠాక్రే 1966లో శివసేనను స్థాపించగా ఎన్నో సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ఠాక్రే వంశస్థులు ఏ ప్రభుత్వ పదవులనూ పొందలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ ఏనాడూ పోటీ చేయలేదు.
ఆదిత్యాస్త్రం అందుకోసమేనా...?
సీఎం కుర్చీయే లక్ష్యంగా సేన... తొలిసారిగా తమ సంప్రదాయాలకు విరుద్ధంగా ఠాక్రే వంశం నుంచి ఆదిత్య అనే అస్త్రాన్ని ప్రయోగించిందా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గత శాసనసభ ఎన్నికల్లో 122 చోట్ల నెగ్గింది భాజపా. ఈసారి మాత్రం ఆధిక్యం తగ్గింది. భాజపా జోరుకు బ్రేక్‌తో శివసేన నైతికంగా పైచేయి సాధించింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని ఠాక్రే సేన వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చూడండి: 'మహా'పోరు: భాజపా జోరుకు బ్రేక్ వేసిన రెబల్స్!
సీఎం పీఠాన్ని చెరిసగం అంటే చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా భాజపాను కోరనున్నట్లు ఇప్పటికే శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే... ఈ ప్రతిపాదన తాజాగా చేసిందేనా... లేక పక్కా వ్యూహంతోనే ఆదిత్యను దించిందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అదే ఆదిత్యను గెలిపించిందా...
శివసేన అంటే ప్రాంతీయ వాదం.. ప్రాంతీయ వాదం అంటే శివసేన. కరుడుగట్టిన ప్రాంతీయవాదానికి కేరాఫ్ అడ్రస్ పార్టీ ఇలా ఓట్ల కోసం... ఇన్నాళ్లూ తాము నిరసించిన విషయాన్నే అస్త్రంగా మార్చుకుంది. ఎన్నికల కోసం ఎప్పుడూ లేని విధంగా.. ఈసారి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రచారం చేయడం గమనార్హం. శివసేన వారసత్వంలో మూడో తరం నేతగా ఆదిత్య ఠాక్రే అరంగేట్రం చేసిన నేపథ్యంలో వివిధ భాషల్లో ఓట్లడుగుతూ బ్యానర్లు కట్టింది. అన్ని వర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది.
తొలిసారి బరిలో... యూత్‌లో క్రేజ్...
ఆదిత్య ఠాక్రే... శివసేనకు అనువైన నియోజకవర్గంలో పోటీ చేయడం, తొలిసారి ఠాక్రే కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం, యువతలో ఆయనకున్న ప్రజాదరణ విజయాన్ని కట్టబెట్టాయని చెప్పొచ్చు. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నా... ప్రజాసమస్యలపై గళం విప్పడం, పలు ప్రభుత్వ విధానాలనూ బహిరంగంగానే విమర్శించడం ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. ఇంకా ఎన్నికలకు ముందు విస్తృతంగా రోడ్‌షోలు నిర్వహించారాయన.
ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ.. మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక ఆదిత్య ఠాక్రే పోరాటం కూడా ఓ కారణం. న్యాయవిద్య కూడా పూర్తి చేసిన ఆదిత్య.. పోరాటాలకు ఏ మాత్రం వెనుకాడరు. ఆయన ఉద్యమాల్లో చాలా వరకు విజయాలే సాధించారు. ఇవే ఆదిత్య గెలుపునకు దోహదం చేశాయి.
కళాకారుడు ఆదిత్య...
29 ఏళ్ల ఆదిత్య తాతలానే కళాకారుడు. తండ్రి ఉద్ధవ్‌లా ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. కవితలు కూడా రాస్తారు. 'మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్' పేరిట ఆదిత్య రాసిన కవితా సంపుటిని 2007లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. 'ఉమ్మీద్' అనే ప్రైవేట్ ఆల్బమ్‌కు ఆదిత్య పాటలు కూడా రాశారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయిలో ఆంగ్ల సాహిత్యం పాఠ్యాంశంగా రోహిన్‌టన్ మిస్త్రీ రచించిన సచ్ ఏ లాంగ్ జర్నీ పుస్తకానికి వ్యతిరేకంగా ఆదిత్య ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి యువసేన అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
ఇదీ చూడండి: 'సేన' కొత్త ప్రతిపాదన.. 'మహా' సీఎం పీఠం చెరిసగం..!