ఎన్నికల సమరం వచ్చిందంటే చాలు.. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నేతలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను ఆకర్షించేందుకు మరెన్నో బహుమానాలు కూడా ఇస్తుంటారు. ఇదే తరహాలో తమిళనాడులోని మీలక్కవట్టన్కురిచిలో గ్రామ సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు స్థానికులందరికీ పలు బహుమానాలు అందించారు. అయితే ఓ దర్జీ వీటిని తీసుకోకుండా నిజాయితీ ప్రదర్శించాడు. అందరిమెప్పు పొందుతున్నాడు.
బహుమతులు గుడికే..
ఆరియలూరు జిల్లాలోని మీలక్కవట్టన్కురిచి గ్రామానికి చెందిన పంచముత్తు వృత్తి రీత్యా ఓ దర్జీ (టైలర్). ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులోనే ఉంటాడు.
గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదవి కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. వీరందరూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గడప గడపకూ వెళ్లి ఓటర్లను ఆకర్షించే హామీలతో పాటు పలు కానుకలు కూడా పంచారు. పంచముత్తు కుటుంబానికి కూడా అందజేశారు. అయితే తన పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి వివిధ పార్టీల నేతలందరూ ఇచ్చిన బహుమతులు పంచముత్తు కంటికి కనిపించాయి. వెంటనే వాటిని స్థానిక దేవాలయం దగ్గర పెట్టి వచ్చేశాడు.
నేతలు ఇచ్చే బహుమానాల వల్ల తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేక పోతున్నందునే ఈ పని చేసినట్లు చెబుతున్నాడు పంచముత్తు. ఈ టైలర్ నిజాయితీని గ్రామస్థులతో పాటు పలు రాజకీయ నేతలు సైతం మెచ్చుకుంటున్నారు.
ఇదీ చూడండి : పాకిస్థాన్ రాక్షస మిడతలతో గుజరాత్ రైతులు హడల్