దక్షిణాదిలో ఇడ్లీకి ఉన్న క్రేజే వేరు. వాటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతతో చేస్తారు. కేరళ వాసులను అడిగితే మాత్రం 'రామస్సెరీ ఇడ్లీ'కి సాటే లేదంటారు.
కేరళ పాలక్కడలోని రామస్సెరీ గ్రామానికి ఇడ్లీతోనే పేరొచ్చింది. ఈ ఊరిలో భాగ్యలక్ష్మమ్మ కుటుంబం ఇంట్లోనే పువ్వుల్లాంటి ఇడ్లీలు తయారు చేస్తోంది. అయితే.. సాధారణ ఇడ్లీ పాత్రల్లో కాక.... ప్రత్యేకమైన మట్టి పాత్రల్లో ఆవిరిపట్టిస్తారు.
ఇక్కడ ఒక్కో ఇడ్లీ.. దాదాపు ఓ ఊతప్పం అంత పరిమాణంలో ఉంటుంది. అందుకే రెండు ఇడ్లీలు తింటేనే కడుపు నిండిపోతుంది. కట్టెల పొయ్యిపై అప్పటికప్పుడు చేసి.., తోడుగా సాంబారు, పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కరివేపాకు పొడి వేసి ఇస్తే లొట్టలేసుకు తినేస్తారు కస్టమర్లు. అందుకే ఈ పల్లెటూరి ఇడ్లీ ఘుమఘుమలు పొలిమేర దాటిపోయి పొరుగూరి ఆహరప్రియులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
ఇలా మొదలైంది..
ఈ ప్రత్యేక ఇడ్లీలకు మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ముదలియర్ సామాజికవర్గానికి చెందినవారు ఈ ఇడ్లీలు తయారు చేసేవారు. క్రమంగా ఆ వంటకం కేరళ చేరింది.
భాగ్యలక్ష్మమ్మది చేనేత కుటుంబం. విదేశీ దుస్తులు వచ్చి భారతీయ చేనేత పరిశ్రమ పడిపోయాక పొట్టకూటి కోసం ఇడ్లీల వ్యాపారం ప్రారంభించారు. రుచి, నాణ్యత, స్వచ్ఛత కలగలపి ఇంట్లోనే వండి రామస్సెరీవాసుల కడుపు నింపుతున్నారు.
క్రమంగా ఆ గ్రామం కమ్మని ఇడ్లీలకు చిరునామాగా మారింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఇడ్లీలను ఆరగించి వెళుతుంటారు సందర్శకులు. ఇప్పుడు వ్యాపారం విస్తరించి ఓ గదినే హోటల్‌గా మార్చింది భాగ్యలక్ష్మమ్మ.
ఇదీ చదవండి:ఎన్కౌంటర్ గురించి అనుమానాలున్నాయా...?