ఆస్తి పంపకాల్లో గొడవలతో కన్నవాళ్లనే ఆనాథలుగా గాలికొదిలేస్తున్నటువంటి ఘటనలు వింటూనే ఉన్నాం. నిండు వృద్ధాప్యంలో ప్రాణాలు విడిచినా.. మానవత్వం మరిచి అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా వదిలేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆత్మహత్యలు.. ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనల్లో మరణించిన వారి పరిస్థితి మరింత దయనీయం. కేరళకు చెందిన ఓ మానవతామూర్తి మాత్రం అలాంటివారికి గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలకడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తున్నాడు. 37 ఏళ్లుగా ఈ పుణ్యకార్యాన్ని నిర్వహిస్తున్నాడు.
కాలువలు, చెరువుల్లో పడి ఉన్న శవాలను వెలికి తీస్తున్న ఈయన పేరు... అబ్దుల్ అజీజ్. కేరళలోని కోజికోడ్ జిల్లా ఒలవన్నా గ్రామానికి చెందిన ఈయన వయసు.... 54 ఏళ్లు. గత 37 ఏళ్లుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అజీజ్. నదిలో పడ్డ ఓ చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆయన ప్రయత్నానికి పలువురి ప్రశంసలు దక్కాయి. ఇక అప్పటి నుంచి అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తూ... వారికి గౌరవంగా తుదివీడ్కోలు పలుకుతున్నాడు.
3 వేలకు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు..
పట్టణంలో గుర్తు తెలియని శవం కనిపిస్తే పోలీసులు అజీజ్కే సమాచారం అందిస్తారు. ఆయన సహాయం లేకుండా పంచనామా నిర్వహించడం కూడా వారికి కష్టం. కుళ్లిన మృతదేహాలను సేకరించే సమయంలోనూ మాస్కులు ధరించడు. అలాంటి శవాలకు అంత్యక్రియలు పూర్తిచేయడం ద్వారా పవిత్రత చేకూరుతుందని అజీజ్ విశ్వాసం.
ఇతరుల సహాయం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు అజీజ్. ఇప్పటి వరకూ 3, 117 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేశాడు. మరణించిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంలోనే సంతృప్తి ఉందని తన సహృదయం ద్వారా చాటుతున్నాడు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ అజీజ్ తన సేవాగుణాన్ని చాటుకున్నాడు.
ఇదీ చూడండి: పదేళ్లలో 3700 మందిని హతమార్చిన మావోయిస్టులు