తమిళనాడు రామనాథపురం జిల్లాలోని, రామేశ్వరంలో తెల్లవారగానే కొందరు మహిళలు సముద్రంలోకి వెళతారు. సముద్ర ఘోష అన్నా, దూసుకొచ్చే కెరటాలన్నా అస్సలు భయం లేదు వారికి. ఎందుకంటే వాళ్లు తమను తాము సాగర పుత్రికలుగా చెప్పుకుంటారు.
"యువతీయువకులైతే 10 నుంచి 15 కిలోల వరకు సేకరిస్తారు. కొందరైతే ఏకంగా 20 కిలోలు కూడా పట్టుకొస్తారు."
- నంబు, సముద్రపు నాచు సేకరించే మహిళ
సముద్రపు ఉప్పునీటిలో గంటల తరబడి నానుతూ, సముద్రపు నాచు సేకరించి, బతుకు వెళ్తదీస్తున్నారు ఈ మహిళలు. అంతసేపు శ్వాస బిగబట్టి, నీటిలోపల ఉండడం అంత సులువైన పనికాదు.
పర్యటకం, చేపల వేట కాకుండా.. నాచు సేకరణ మహిళలకు అధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం. వీరిలో ఎక్కువశాతం 60 ఏళ్లకుపైబడినవారే. చిన్నవయసులోనే ఇందులోకి ప్రవేశిస్తారు వీళ్లంతా. సౌందర్య సాధనాల తయారీలో వాడే సముద్రపునాచుకు ఏడాదంతా గిరాకీ ఉంటుంది.
"ఒక్కసారి సముద్రంలోకి దిగితే.. 8 నుంచి 12 కిలోల సీవీడ్ పట్టుకొస్తాం. కానీ...అందుకోసం 5 గంటలైనా ఆ ఉప్పు నీటి లోపల ఉండాల్సి వస్తుంది."
- నంబు
అలా సేకరించిన సముద్రపు నాచును తీరంలో ఎండబెట్టి, కిలోకు 50 రూపాయల చొప్పున విక్రయిస్తారు. రోజంతా కష్టపడితే.. వాళ్ల సంపాదన 500 నుంచి 600 రూపాయలకు మించదు.
"సవాళ్లతో కూడుకున్నదే అయినా.. చిన్నప్పటినుంచీ చేస్తున్న పని కావడం వల్ల అలవాటైంది. 50 ఏళ్లకుపైగా ఇదే పని చేస్తున్నాను. నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. ఉదయం 6 గంటల కల్లా సముద్రంలోకి వెళ్తాం. నాచు సేకరించి, ఒంటిగటకల్లా బయటకు వస్తాం. తీరానికి వెళ్లి, ఇసుకపై తెచ్చినదాన్ని ఎండబెడతాం. ఆటో కోసం 60 రూపాయలు ఇవ్వాలి."
- మరియమ్మల్, సముద్రపు నాచు సేకరించే మహిళ
ఇతర ఖర్చులు, వాళ్లకు ఎదురయే ఇబ్బందులు పక్కనపెడితే.. పని విషయంలో ఈ సాగరపుత్రికలకు వయసుతో సంబంధం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇదీ చూడండి: ప్రధాని మన్ననలు పొందిన ఐపీఎస్ కిరణ్‌శృతి గురించి మీకు తెలుసా?