90 స్థానాలు కలిగిన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 93 శాతం మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది.
10 శాతం వృద్ధి..
2014 ఎన్నికల్లో మొత్తం 75 మంది కోటి రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 10 శాతం మేర పెరిగింది. 90 మందిలో 84 మంది కోటి రూపాయలకుపైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు నివేదించింది ఏడీఆర్. సగటున ఒక శాసనసభ్యుడికి రూ.18.29 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. 2014లో అది రూ.12.97 కోట్లుగా ఉంది.
40 మంది భాజపా ఎమ్మెల్యేలలో 37, 31 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 29 మంది కరోడ్పతులేనని తెలిపింది.
జేజేపీ నేతలంతా..
దుశ్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)లోని 10 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీరిలో సగటున ఒక్కొక్కరికి రూ.25.26 కోట్లు ఆస్తులన్నట్లు తెలిపింది ఏడీఆర్.
12 మందిపై క్రిమినల్ కేసులు..
90 మంది శాసనసభ్యుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో భాజపాలో ఇద్దరు, కాంగ్రెస్లో నలుగురు, జేజేపీలో ఒకరిపై ఈ కేసులు ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 9 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
62 మందికి డిగ్రీ పట్టా..
కొత్తగా ఎన్నికైన వారిలో 57 మంది శాసనసభ్యులు 41-50 మధ్య వయసు ఉన్నారు. 62 మంది డిగ్రీ ఆపైన ఉన్నత చదువుల పట్టా కలిగి ఉన్నారు.