2013లో దిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక కేసులో పోక్సో న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి నరేష్ కుమార్ మల్హోత్రా... నిందితులు ప్రదీప్ కుమార్, మనోజ్ షాలను దోషులుగా ప్రకటించారు. బాలిక తీవ్ర క్రూరత్వాన్ని అనుభవించిందని వ్యాఖ్యానించారు.
"సమాజ సామూహిక మనస్సాక్షిని ఈ ఘటన కదిలించింది. మన సమాజంలో మైనర్లను దేవతలుగా భావిస్తాం. కేవలం ఐదేళ్లున్న బాలిక తీవ్రమైన క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అనుభవించింది."-న్యాయస్థానం
57 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐదేళ్లకు పైగా సమయం పట్టిందని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. దోషులకు విధించే శిక్షకు సంబంధించి జనవరి 30న వాదనలు విననున్నట్లు తెలిపింది.
'న్యాయం జరిగింది'
కోర్టు తీర్పు పట్ల బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరిగిందన్నారు. రెండేళ్లలో ట్రయల్స్ పూర్తికావాల్సి ఉండేదని... చివరకు ఆరేళ్లకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు.
మీడియాపై దాడి
దిల్లీ కోర్టు నిర్ణయం అనంతరం బయటకు వచ్చే క్రమంలో దోషుల్లో ఒకడు మీడియాపై దాడికి పాల్పడ్డాడు. విలేకరి మొబైల్ ఫోన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో అధికారులు దోషుల్ని నిలువరించారు.
బాలికపై క్రూరత్వం
2013 ఏప్రిల్ 15న గాంధీ నగర్ ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై ప్రదీప్ కుమార్, మనోజ్ షాలు కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక శరీరంలోని రహస్య భాగాలలో వస్తువులను చొప్పించి నరకయాతనకు గురిచేశారు. చివరకు బాలిక మరణించిందని భావించి మనోజ్ ఇంట్లోనే వదిలి వెళ్లారు. అయితే 40 గంటల తర్వాత బాలికను కాపాడారు. నిందితులను దిల్లీ పోలీసులు బిహార్లోని ముజఫర్పుర్, దర్భంగా ప్రాంతాల్లో 2013లో అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: అభిమానులకు శుభవార్త... ఫిబ్రవరి 8న బరిలోకి ధోనీ!