కర్ణాటకలో అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 16 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అధికార భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ 17 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది భాజపా. పార్టీలో చేరిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 13 మందికి టిక్కెట్లు కేటాయించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, భాజపా రాష్ట్ర కార్యదర్శి నలీన్ కుమార్ కాటీల్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సమక్షంలో అనర్హత ఎమ్మెల్యేలు కమలం పార్టీలో చేరారు. వీరిలో కాంగ్రెస్ నాయకుడైన ఆర్ రోషన్ బైగ్ మాత్రం అధికార పార్టీలో చేరలేదు.
ఈ 17 మంది తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం వల్లే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని సీఎం యడియూరప్ప అన్నారు. వీరికి పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కచ్చితంగా 15 సీట్లు గెలిచి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
15 నియోజకవర్గాల్లో డిసెంబరు 5న ఉపఎన్నికలు జరగనున్నాయి. భాజపా అధికారాన్ని నిలుపుకోవాలంటే ఈ 15 స్థానాల్లో కనీసం ఆరు గెలవాలి. ఈ 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయటం వల్ల కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.
ఇదీ చూడండి:రఫేల్పై రాహుల్ క్షమాపణలకు భాజపా డిమాండ్