కేరళ కోజికోడ్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో పదేళ్ల అబీర్ చేసిన ఫిర్యాదు వైరల్‌గా మారింది. తమ సైకిళ్లు బాగు చేసి ఇస్తానని, మూడున్నర నెలలు తిప్పుకున్న ఓ మెకానిక్ నుంచి ఎట్టకేలకు సైకిళ్లు దక్కించుకున్నాడు ఈ బుడతడు.
ఎలంపిలాడ్ ఎల్పీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న అబీర్‌ను గత కొన్ని నెలలుగా ఓ మెకానిక్ సతాయిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక, ఓ ఫిర్యాదు లేఖ రాశాడు. ఉద్రేకంగా మెప్పయుర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు, జరిగిందంతా చెప్పి.. న్యాయం చేయమని కోరాడు.
లేఖలో ఏం రాశాడు?
"సెప్టెంబర్ 5వ తేదీన నా సైకిల్, నా తమ్ముడి సైకిళ్లను బాగుచేయమని ఓ మెకానిక్కు ఇచ్చాం. కానీ, అతను మా సైకిళ్లు ఇంకా తిరిగివ్వలేదు. వారికి మేము రూ.200/- అడ్వాన్స్ కూడా చెల్లించాము. ఇప్పుడు ఆ కొట్టు యజమాని మా ఫోన్ ఎత్తడంలేదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా.. బాగు చేసి ఇస్తాను అంటున్నాడు. మేమెప్పుడు దుకాణానికి వెళ్లినా ఆ దుకాణం మూసి ఉంటుంది. ఈ విషయంపై విచారించడానికి మా ఇంట్లోవారెవరూ సహరించడం లేదు. కాబట్టి, దయచేసి మీరు మా సైకిళ్లను తిరిగి ఇప్పించగలరు."
ఇదే పదేళ్ల అబిర్ ఫిర్యాదు లేఖ సారాంశం.
శభాష్ సాహస బాలుడా!
అబీర్ ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు నడిచివచ్చిన తీరు పోలీసులను మెప్పించింది. నోట్‌బుక్ కాగితంపై ఫిర్యాదు అందించడం వారిని ముచ్చటపడేలా చేసింది. అందుకే ఈ కేసును కేరళ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాల్యంలోనే పోలీసు వ్యవస్థపై నమ్మకం బలపడేలా చేయాలని నిశ్చయించుకున్నారు.
మెకానిక్ బాలక్రిష్ణన్‌ను వెతికి పట్టుకున్నారు. అయితే ఇన్నాళ్లు.. తన కుమార్తె పెళ్లి పనుల్లో పడి సైకిళ్లు తిరిగి ఇవ్వలేకపోయానని సంజాయిషీ చెప్పుకున్నాడు మెకానిక్. ఆపై జనమైత్రీ(ఫ్రెండ్లీ పోలీస్) పోలీసులు ఎట్టకేలకు అబీర్ సైకిళ్లను అప్పగించారు.
ఇక, ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్‌కు ఊతమిచ్చిన అబీర్ లేఖను ఫోటో తీసి ఫేస్బుక్లో పంచుకున్నారు కేరళ పోలీసులు.
ఇదీ చదవండి:గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్.. పట్టేసిన పోలీసులు!