జమ్ముకశ్మీర్లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10మందికి చేరింది. మరో 36మంది గాయపడ్డారు. వీరిలో 14మంది పరిస్థితి విషమంగా ఉంది. గురువారం జమ్ము నుంచి సురంకోట్ వెళ్తుండగా రాజౌరీ జిల్లాలో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదం సమయంలో బస్సులో సంఖ్యకు మించిన ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది.
ఆరోగ్యం విషమంగా ఉన్న 14మందిని జమ్ములోని జీఎమ్సీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గులామ్ అహ్మద్ మీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించారు.