కడప జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రమైన గండికోటలో గైడ్ లేకపోవడం పర్యటకులకు నిరాశ కలిగిస్తుంది. గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఈ కోటలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఉత్సాహంతో వస్తున్న పర్యటకులకు వివరాలు చెప్పేవారు లేక అక్కడి కట్టడాలు చూసి వెను తిరుగుతున్నారు. ఇక్కడ మార్గనిర్దేశకుడ్ని ఏర్పాటు చేస్తే చూడని ప్రదేశాలు, తెలియని కట్టడాల గురించి మరింత తెలుసుకొనే వెసులుబాటు పర్యటకులకు కలుగుతోంది.
కడప చరిత్రకు సజీవసాక్ష్యం...
కళ్యాణి చాళుక్య రాజైన త్రైలోక్య మల్ల మహారాజుకు సామంత రాజుగా ఉన్న కాకరాజు క్రీస్తు శకం 1123, జనవరి 9న గండికోట నిర్మించినట్లు దుర్గం కైఫీయాత్ తెలుపుతోంది. క్రీస్తు శకం 1279 నాటి అత్తిరాల శాసనంలో గండికోట గురించి మొదటిసారిగా ప్రస్తావన కనిపిస్తోంది. కోట గోడలను ఒక టన్ను బరువుండే ఎర్రటి నున్నటి రాళ్లతో నిర్మించారు. పునాది లేకుండానే కొండ బండలపై కోటగోడను నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. తూర్పు నుంచి పడమర వరకు కోట పొడవు 1200 మీటర్లు, వెడల్పు 800 మీటర్లు... కోట గోడ చుట్టూ 101 బురుజులున్నాయి. చుట్టూ సైనికులు పహారా కాసేందుకు 5 మీటర్ల వెడల్పు బాట నిర్మించారు. 5 రహస్య మార్గాలు, ఒక సొరంగ మార్గం ఉంది.
గండికోట అనగానే మనకు గుర్తుకు వచ్చేది జుమ్మా మసీదు, పెన్నా లోయ..ఇంతటి విశిష్టమైన కోట చరిత్ర గురించి చెప్పేవారు లేక పోవడం విచారకరం. పర్యటక శాఖ అధికారులు స్పందించి కొంతమంది గైడ్లను ఏర్పాటు చేస్తే చరిత్ర గురించి తెలుసుకోవచ్చని పలువురు కోరుతున్నారు.
కోటను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక , తెలంగాణ రాష్ట్రం నుంచి పర్యటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వారిని నిరాశ పరచకుండా పర్యటక శాఖ మార్గ నిర్దేశకులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి...ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న గండికోటకు ఏమైంది ?