450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల తాకిడికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో... ఇక్కడ మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గలేదు. కానీ భవనాల పరిస్థితి దారుణంగా ఉంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల నిర్మించిన భవనాల్లోనే ఇరుగ్గా కాలం వెళ్లదీస్తున్నారు. ఇది కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుస్థితి.
1960 డిసెంబర్ 27న రాజంపేటలో బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల భవనాల పైకప్పు చెక్కలు, పెంకులతో నిర్మించారు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరాయి. పెంకులు రోజూ ఒకటో రెండో కింద పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పెంకులు పడి విద్యార్థులు గాయపడిన సందర్భాలూ అనేకం. ధ్యాన మందిరంలో వరండా అంతా పెంకులు ఊడిపోయి... చెక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు కూర్చుండే గది వద్ద పైకప్పు పూర్తిగా దెబ్బతింది. ఉపాధ్యాయుల గది గురించి ఎంత తక్కువ చెబితే... అంత మంచిది.
ఈ పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు 15 సెక్షన్లు ఉన్నాయి. గదులు మాత్రం 12 మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా పలు తరగతులు చెట్ల కిందనే సాగుతున్నాయి. వర్షం పడితే పాఠశాల ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. ఈ పరిస్థితులను ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించినా... పరిష్కార మార్గం మాత్రం చూపడం లేదు. ప్రభుత్వం స్పందించి పాఠశాలను బాగుచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు