కడప జిల్లాలో ఇటీవల అక్రమ బంగారం భారీగా పట్టుబడుతోంది. మేలిమి పసిడి ఆభరణాలు లభిస్తాయనే పేరున్నందున... ఈ ప్రాంతంలో కొనేందుకు జనం ఆసక్తి చూపుతుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు... పన్నులు ఎగ్గొట్టేందుకు బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా చెన్నై నుంచి తరలిస్తున్న దాదాపు 7 కిలోల పసిడిని పోలీసులు పట్టుకున్నారు.
బిల్లులు తప్పనిసరి
బంగారు ఆభరణాలు తయారుచేసి మరో ప్రాంతానికి తరలించాలంటే తగిన బిల్లులు ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయపన్ను, ఇతర రకాల సుంకాలు చెల్లించాలి. అలాంటివి ఎగ్గొట్టేందుకు కొందరు వ్యాపారస్థులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గురువారం చెన్నై నుంచి కడపకు 6 కిలోల 930 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ఆశ్చర్యం
బంగారం అక్రమ రవాణాదారులు... కారులో పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు. వాహనం వెనుక సీటు లోపల చిన్న సూట్‌కేసు పట్టేలా ప్రత్యేకంగా లాకర్ తయారుచేశారు. ఎవరికీ అనుమానం రాకుండా... సీటు కవరుతో కప్పేసి జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కడప ప్రొద్దుటూరులో మేలిమి బంగారం దొరుకుతుందనే పేరున్నందున... వినియోగదారులు ఎక్కువగా ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. 6 నెలల్లోనే ప్రొద్దుటూరు, కడప, ఎర్రగుంట్ల వద్ద బిల్లులు లేకుండా భారీఎత్తున బంగారం పట్టుబడింది.
ఇదీ చూడండి: