జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌కు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తులపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భారతి సిమెంట్స్ వ్యవహారంలో 749 కోట్ల స్థిర, చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.569 కోట్ల 57 లక్షలు, ఆయన భార్య భారతికి చెందిన రూ.22 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను అడ్యుడికేటింగ్ అథారిటీ ధ్రువీకరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జగన్, భారతిలతో పాటు... సండూర్ పవర్, సిలికాన్ బిల్డర్స్, యుటోపియా ఇన్ ఫ్రా తదితర కంపెనీలు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించాయి. వీటిపై విచారించిన అప్పీలేట్ అథారిటీ.. డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని గత జులైలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె. లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్తుల జప్తునకు సంబంధించి అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా యథాతథస్థితిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న జగన్, భారతి, కంపెనీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి :