సమస్య పరిష్కారం కోసం ఏం చేశాడో తెలుసా? అక్కడ చక్కగా సిమెంటు రోడ్డు ఉంది. అయినా.. చినుకు పడితే చెరువే. నడవలేని పరిస్థితి. నెలన్నరగా స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో వెళ్లే ఎవ్వరూ పట్టించుకోలేదు. అధికారులకు ఈ విషయం అసలు పట్టలేదు. ఎవరికి వారు ఈ సమస్య తమది కాదని అన్నట్లు వెళ్ళిపోయేవారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి మాత్రం సమస్య పరిష్కారం కోరుతూ అక్కడే బురద నీటిలో బైఠాయించాడు. సమస్య తీరే వరకు లేచేదిలేదని భీష్మించుకు కూర్చున్నాడు. చుట్టుపక్కల వారు ఎంత చెప్పినా బురద నీటి నుంచి లేవలేదు. పురపాలక అధికారులు స్పందించి.. సమస్య పరిష్కారానికి చొరవ చూపటంతో అప్పుడు లేచాడు. ఇది కడప జిల్లా రాజంపేటలో జరిగిన సంఘటన.పోరాటానికి ఫలితం
కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో తుమ్మల అగ్రహారానికి వెళ్లే మార్గం వద్ద సిమెంట్ రోడ్డు దారుణంగా ఉంది. వర్షం పడితే అక్కడ చెరువులా తయారవుతుంది. ఈ సమస్య పరిష్కారం కోరుతూ విజయ్ అనే స్థానికుడు బురద నీటిలో బైఠాయించాడు. ఎవరు చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. పురపాలక అధికారులు స్పందించి బురద నీటిని తొలగించి మట్టిని.. తీసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా పరిష్కారమైంది. విజయ్ చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు కాలువ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
భార్య మీద అనుమానం... పసికందు బలి