ప్రేమోన్మాదానికి మరో విద్యార్థిని తీవ్రగాయాల పాలైంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిపై ఓ వివాహితుడు కర్కశంగా కత్తితో దాడిచేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. కత్తివేట్లతో తీవ్ర గాయాలుపాలైన విద్యార్థిని... ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.
ఉన్నత విద్యనభ్యసించాలని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న విద్యార్థినికి...ప్రేమ పేరుతో వేధింపులు శాపంగా మారాయి. వివాహితుడైన ఉన్మాది ప్రేమించాలంటూ ఆమె వెంటపడ్డాడు. ఆరు నెలలుగా వేధిస్తునే ఉన్నా...యువతి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పైశాచికత్వంతో విరుచుకుపడ్డాడు. కత్తితో దాడి చేసి...రాక్షసానందం పొందాడు. ఉన్మాది దాడికి బలైన యువతి రక్తపుమడుగులో నరకయాతన అనుభవించిన ఈ హృదయవిదారక ఘటన.... పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన తేజశ్విని.. తన అమ్మమ్మతోపాటు కవిటంలో ఉంటోంది. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి బస్టాప్‌కు సైకిల్ పై వచ్చి.. అక్కడ నుంచి బస్సులో పెనుగొండకు వెళ్తుండేది. 2 నెలలుగా సుధాకర్ అనే వివాహితుడు ప్రేమించమంటూ తేజశ్విని వెంట పడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లకు చెప్పడంతో వారు సుధాకర్‌ను మందలించారు. మరోసారి వెంటపడితే పోలీసుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇది జరిగి నెలరోజులయ్యాక...దాడికి పాల్పడ్డాడు. బస్టాప్ వద్ద వేచి ఉన్న తేజశ్వినిపై సుధాకర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకున్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోయి..పురుగులమందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరూ పాలకొల్లు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఏలూరు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
సుధాకర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కర్కశంగా దాడి చేసిన సుధాకర్‌ను కఠినంగా శిక్షించాలంటూ...అశ్విని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.