కలసిరాని నేత పని... చేనేతలను పస్తులుంచుతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా... చేనేత కార్మికులు డొక్కాడని దీనస్థితిలో బతుకులీడుస్తున్నారు. మగ్గం నేసేవారే కాకుండా... అనుబంధ రంగాల కార్మికులదీ అదే దుస్థితి. చేనేతను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిసెంబరు నుంచి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం ప్రారంభించబోతోంది. ఈ పథకం కింద... ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తారు. అయితే... లబ్ధిదారుల అర్హతపై విధించిన షరతులు అనుబంధ రంగాల కార్మికులకు శాపంగా మారాయి.
కేవలం మగ్గం పని చేసే వాళ్లకే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం షరతు విధించింది. జిల్లావ్యాప్తంగా చేనేత అనుబంధ విభాగాల్లో వేలమంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి ఈ నిబంధన ప్రతికూలంగా మారింది. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో నేతన్న నేస్తం పథకం లబ్ధిదారుల గుర్తింపు పూర్తయింది. సుమారు 4 వేల 300 మంది లబ్ధిదారులను గుర్తించారు. అనుబంధ విభాగాల్లో ఉన్న 2 వేల కుటుంబాలను పరిగణనలోకి తీసుకోలేదు.
తాము మగ్గం నేయకపోయినా... చేనేత కార్మికులమేనని నేతన్నలు అంటున్నారు. తమకు చేనేత కార్మికులుగా గుర్తింపు కార్డులున్నాయనీ... చేనేత పింఛన్లూ తీసుకుంటున్నామని చెబుతున్నారు. 'చేనేత నేస్తం' వర్తింపులో షరతు తొలగించి... తమకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశామని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి: