అధిక దిగుబడుల మోజులో పడి ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. సాగులో వస్తున్న మార్పులు సైతం.. అనేక జబ్బులు వెంట తెస్తున్నాయి. ఈ విపత్తుపై పరిశోధన సాగించి అద్భుత ఫలితాలు సృష్టిస్తున్నాడు పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు సుబ్రమణ్యం. మంచి జీతం, ఉన్నత స్థానం ఉన్నా అసంతృప్తితో ఉన్న ఆయన.. తనకు ఇష్టమైన వ్యవసాయం బాట పట్టారు. రసాయన సాగుకు బదులు.. దేశీయ వంగడాలు తీసుకురావడానికి నడుం కట్టారు. దేశవాళి వరి రకాలు సేకరించి.. స్వచ్ఛమైన పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. తనకున్న 15 ఎకరాల పొలంలో 54 రకాల దేశావళి వరిరకాలు సాగుచేస్తున్నారు.
వ్యవసాయంపై ప్రాథమిక పరిజ్ఞానంలేని సుబ్రమణ్యం.. తోటి రైతులు ఔరా అనేలా సాగు చేస్తున్నారు. సేంద్రియ సాగు చేపట్టాలన్న ఇష్టంతో టీసీఎస్‌లో ఉద్యోగాన్ని వదులుకొన్నారు. ప్రకృతి సాగు చేయాలని నిశ్చయించుకొన్నారు. దేశావళి వంగడాలను సేంద్రియ విధానంతో పండించి.. వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొన్నారు. తోటి రైతులు అపహాస్యం చేసినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పొలంలోకి దిగి... వారితోనే ఔరా అనిపించుకొంటున్నారు. శాస్త్రవేత్తగా మారి దేశవాళి వరివంగడాలు సాగులో మెళకువలు ఇతరులకు సైతం అందిస్తున్నారు.
దేశీ వరివంగడాల కోసం దేశం నలుమూలల గాలించారు. ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబంగా తదితర ప్రాంతాల నుంచి వరి వంగడాలు సేకరించారు. సుబ్రమణ్యం తనపొలంలో ప్రతి వంగడానికి నారుమడి వేయించారు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా వరినాట్లు వేశారు. ఈ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చింది. సాధారణ రకాల కంటే పంట ఏపుగా పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఆయన పొలాన్ని చూడడానికి వస్తున్నారు. సమీకృత సేద్యం విధానంలో వరి పొలంలోనే చేపలు పెంచుతున్న తీరుకు ఆశ్చర్యపోతున్నారు.
వ్యవసాయానికి నేటి యువత దూరమవుతోంది.. భవిష్యత్తులో వ్యవసాయం చేసే నాథుడే కరువయ్యే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. అలాంటిది సుబ్రమణ్యం మాత్రం.. ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేపట్టి.. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి