ప్రహరీగోడ, మరుగుదొడ్డి, కనీసం కూర్చునే ప్లోరింగ్ లేని ఈ పాఠశాల... ప్రభుత్వ బడి అంటే ఆశ్చర్యం కలగక మానదు. కూలిపోయే స్థితిలో ఉన్న ఈ శిథిల భవనంలోనే ... గత రెండేళ్లుగా పాఠశాల నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీ. నరసాపురం మండలం కొల్లివారిగూడెంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. 70 మంది విద్యార్థులు ఉన్న ఈ బడిలో వర్షంపడితే నిలబడే పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది.
భయం మధ్యే తరగతులు...
ఇక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సరైన సౌకర్యాల కోసం ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా... అందుబాటులో ఉన్న వనరులతోనే పాఠశాల కొనసాగించారు. ప్రమాదకరంగా మారిందని గతంలో ఉన్న భవనాన్ని కూల్చేశారు. అనంతరం కొద్దిరోజులు రేకుల షెడ్డులో తరగతులు నిర్వహించారు. ఇప్పడు ఓ చిన్న ఇంట్లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివించలేక ప్రభుత్వ బడికి పంపిస్తుంటే... అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ భవనం కూలుతందో అని ఆందోళన చెందుతున్నారు.
అన్ని పాఠశాలలు అంతే..
నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం, జీలుగుమిల్లి, చింతలపూడి, టీ.నరసాపురం మండలాల్లోని 53 పాఠశాలల్లో ఇదే పరిస్థితి. పాడుబడిన ఇళ్లు, పశువుల పాకలు, పొగాకు నిల్వ భవనాలే పాఠశాలలుగా మారుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పక్కా భవనాల పనులు ముందుకు సాగట్లేదు. వాటి నిర్మాణానికి గత ఐదేళ్లలో 180 కోట్ల రూపాయలు కేటాయించినా... 50కోట్ల రూపాయలైనా ఖర్చు చేయలేకపోయారు. తాజా విధానాలతో ఈ పరిస్థితి మారుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయించిన నిధుల్ని పూర్తిస్థాయిలో ఖర్చు చేసి పాఠశాలలు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి..