పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెంకు చెందిన మైలవరపు పుల్లయ్య... మరణించిన తన భార్య కోసం మందిరం నిర్మించారు. ఆమె విగ్రహానికి రోజూ పూల మాలలు కట్టి తన ప్రేమను చూపిస్తున్నాడు. పుల్లయ్య తన మేనమామ కూతురైన వెంకటలక్ష్మిని చిన్న వయసులోనే పెళ్లాడారు.
ఈ అన్యోన్య దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్థికంగా చిన్న కుటుంబం కావటంతో... పుల్లయ్య కష్టపడి సంసారాన్ని నెట్టుకొచ్చాడు. తన భార్య వెంకటలక్ష్మి... భర్తకు అన్ని పనుల్లోనూ చేదోడువాదోడుగా ఉండేది. ఈనేపథ్యంలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో... సరిగ్గా మూడేళ్ళ కిందట వెంకటలక్ష్మి గుండెపోటుతో మరణించింది.
భార్య మరణాన్ని తట్టుకోలేని పుల్లయ్య... ఆమెను దహనం చేసిన పొలం దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. ఆమె నాటిన పూలమొక్కలు, చెట్లను చూస్తూ గడిపేవారు. తన భార్య జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయాడు. చివరి వరకూ ఆమెను చూస్తూ బతికేయాలన్న ఆలోచన వచ్చింది పుల్లయ్యకు. ఆమెను సమాధి చేసిన చోట విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. గుడి కట్టాడు.
రోజూ అక్కడే ఉన్న పూలతో మాలలు పేర్చి ఆమె విగ్రహానికి అలంకరిస్తున్నాడు. ఆ గుడిలోనే పుల్లయ్య సేదతీరుతున్నాడు. భార్యకు ఇష్టమైన రకరకాల మొక్కలు నాటి ఆమెను (విగ్రహాన్ని) చూస్తూ కాలం గడుపుతున్నారు. తన భార్య వెంకటలక్ష్మి భౌతికంగా దూరమైనా... ఆమె జ్ఞాపకాలు తనలో పదిలంగా ఉన్నాయంటున్నారు పుల్లయ్య.
ఇదీ చదవండి