విజయనగరం జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో బొబ్బిలి ఒక్కటి. విద్య, వాణిజ్యపరంగానే కాకుండా పారిశ్రామికంగానూ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో భవిషత్తు అవసరాల దృష్ట్యా... పట్టణంలోని రహదారులను విస్తరించాలని పాలకులు నిర్ణయించారు. ఈ మేరకు 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు అప్పట్లో భూమి పూజ సైతం నిర్వహించారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావటంతో రహదారి విస్తరణకు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా నాయకులు, మళ్లీ భూమిపూజ చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. కానీ నేటికీ పనుల్లో పురోగతి లేదు.
తొలి విడతగా ప్రధాన రహదారిలోని పెట్రోలు బంకు నుంచి వేణుగోపాల ఆలయ కూడలి వరకు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పనులు ఆరంభించి ఏడాదిన్నర తర్వాత 331 ఆక్రమ నిర్మాణాలకు గాను 300 వరకు సైతం తొలగించారు. కానీ పూర్తిస్థాయి విస్తరణ పనులు మాత్రం చేపట్టలేదు. కేవలం 800మీటర్లు మాత్రమే పూర్తి చేశారు. రహదారి విస్తరణ పూర్తికాక... ప్రస్తుతం పెరిగిన వాహన రద్దీ పెరగటం మరోవైపు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పలు సమస్యలతో సతమతమవుతున్నామని ప్రజలంటున్నారు.
బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణలో మిగిలిన కిలోమీటరు పనులు తర్వలో చేపడతామని శాసనసభ్యులు చెబుతున్నా... స్థానికులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిలో కేవలం 800మీటర్లు పూర్తి చేసేందుకు 8ఏళ్లు పట్టింది. ఇక కిలోమీటరు పూర్తి చేసేందుకు ఇంకెత సమయం పడుతోందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?