విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ. వాటిలో చాలా గ్రామాలు రహదారులకు దూరంగా ఉన్నాయి. కొండపై నివసించే గిరిజనులు... ఏదైనా ఆపద వచ్చి ఆస్పత్రికి వెళ్లాలంటే... డోలీ ఒక్కటే దిక్కు. అది కూడా.. ఇద్దరు ముగ్గురు మోస్తూ.. వెళ్లాల్సిందే. దశాబ్దాలుగా గిరిజనులు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. ఓట్ల కోసం వారి వద్దకు వెళ్లే నేతలు.. సమస్యలు బాగానే వింటారు. ఇదిగో... అదిగో అంటూ... ఆఖరికి మొహం చాటేస్తారు. చేసేది లేక... వారు డోలీలనే నమ్ముకొని జీవిస్తున్నారు.
తాజాగా.. సాలూరు మండలం సిరివర గ్రామానికి చెందిన ఓ మహిళకు 10 రోజులుగా జ్వరం వస్తోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే... కొండ దిగాలి. ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. సరైన రహదారి లేక వైద్యం చేయించలేదు. ఆరోగ్యం క్షీణించింది. ఇక చేసేదేమి లేక... ఆమె కుటుంబీకులు డోలీ కట్టి బాధితురాలిని 13 కిలోమీటర్లు మోసుకొచ్చారు. ఆ తర్వాత.. ప్రైవేటు వాహనంలోనే పార్వతీపురంలోని ఆస్పత్రికి తరలించారు.
గతంలోనూ ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళను డోలీలో మోసుకెళ్తుంటే... మార్గ మధ్యంలోనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి... రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణం జరగలేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లు ఈ డోలీ కష్టాలు అంటూ... కన్నీటి పర్యంతం అవుతున్నారు. నేతలు, అధికారులు తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ... 'చేత కాకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి'