ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనం. బిక్కుబిక్కుమంటూ చెట్ల కిందే రెండేళ్లుగా చదువుకుంటున్న చిన్నారులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గుణదాం ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి ఇది. చిన్నారులు ఇలా ఇబ్బందిపడుతున్నా... కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు.
1 నుంచి ఐదో తరగత వరకు... సుమారు 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులతోనే పాఠశాలను నెట్టుకొస్తున్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. మధ్యాహ్న భోజనం అందించడం పక్కన పడితే... వండేందుకూ సరైన చోటు లేదు. ఇలా చెప్పుకొంటూ పోతే... గుణదాం పాఠశాలలో సమస్యల పాఠాలే అనేకం ఉన్నాయి.
విద్యార్థుల కష్టాలు చూసిన గ్రామ పెద్ద కృష్ణారావు... పెద్ద మనసుతో స్పందించారు. తన ఇంటిని పాఠశాలగా వాడుకునేందుకు ఇచ్చారు. హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న పాఠశాల భవనం మరమ్మతుకు... రెండుసార్లు నిధులు మంజూరైనా అధికారులు నిర్మాణ పనులు చేపట్టలేదని కృష్ణారావు చెప్పారు. ఎంపీ బెల్లం చంద్రశేఖర్ పాఠశాల సమస్యలపై స్పందించి... సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి... పాఠశాల భవనాన్ని బాగుచేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం... సమస్యల వలయంలో వసతిగృహం