విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకిలో... దాదాపు 8 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నవారే. అంతవరకు బాగానే ఉన్నా... ఈ గ్రామస్థులను దశాబ్దాలుగా బోద కాలు వ్యాధి వేధిస్తోంది. ఈ గ్రామంలో చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకూ... దాదాపు వెయ్యి మంది బాధితులు ఉన్నారు. కనీసం ఇంటికి ఒకరు చొప్పున బోధకాలు సమస్యను ఎదుర్కొంటున్నారు. తీవ్రజ్వరం రావడం, ఏ పనీ చేసుకోలేక ఆర్థికంగా చితికిపోవడం వంటి సమస్యలు... బాధితుల్నీ, వారి కుటుంబసభ్యుల్నీ వేధిస్తున్నాయి. కేవలం మందుల కోసమే నెలకు 2వేల నుంచి 3 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఏడాది క్రితం ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్ కథనంతో ఈ సమస్యపై అధికారులు స్పందించారు. వారు చేసిన హడావిడి చూసి... సమస్యలు తీరుతాయేమోనని గ్రామస్థులు సంతోషించారు. అయితే అపరిశుభ్రతే ఈ పరిస్థితికి కారణమని నిర్ధరించిన అధికారులు... నివారణకు 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. బాధితులకు ప్రత్యేక పింఛను ఇవ్వాలన్న సిఫార్సూ అమలుకాలేదు. ఫైలేరియా యూనిట్ ఒకటి ఏర్పాటుచేసినా... సిబ్బంది, నిధుల కొరత కారణంగా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు తెస్తామన్న అధికారుల హామీ నీటిమూటగానే మిగిలింది. వారంలో ఓ రోజు రాత్రివేళ రక్త నమూనాలు సేకరించాల్సి ఉన్నా... పూర్తిస్థాయిలో ఆ పని జరగడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
పెదపెంకి గ్రామాన్ని 4 దశాబ్దాలుగా ఫైలేరియా పీడిస్తున్నా... ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోలేదు. కనీస చర్యలు చేడితే భవిష్యత్తు తరాలైనా వ్యాధికి దూరంగా ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: